ఫోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలని యువతకు సూచన, స్వీయ క్రమశిక్షణ ఒక సబ్జెక్టుగా పెట్టేందుకు యోచన
విశాఖపట్టణం,జయజయహే : తెలిసీ తెలియని వయసులో ప్రేమ ఉచ్చులో పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోరాదని, లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దాని సాధన కోసం నిరంతరం శ్రమించాలని రాష్ట్ర హోం మంత్రి హితవు పలికారు. ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలుపాలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. పోక్సో కేసుల్లో 60 శాతం మంది 18-20 ఏళ్ల లోపు వారే ఉండటం శోచనీయమని పేర్కొన్నారు. విశాఖపట్టణంలో ఉడా చిల్డ్రన్ ఎరీనా వేదికగా విశాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “మహిళా రక్షణకు కలిసికట్టుగా” అనే రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించిన హోం మంత్రి యువతను ఉద్దేశించి పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో మొదటిసారిగా మహిళ రక్షణకు కలిసికట్టుగా అనే కార్యక్రమానికి విశాఖ నుంచి శ్రీకారం చుట్టామని, మహిళల రక్షణకు, ధైర్యానికి ఇదొక చక్కని వేదిక అవుతుందని మంత్రి అనిత పేర్కొన్నారు. యువత వంద సంవత్సరాల జీవితం కోసం ఆలోచించాలని, లక్ష్యాలను నిర్దేశించుకొని సాధన కోసం తపించాలని సూచించారు. ఇతర భ్రమల్లో పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. స్వీయ నియంత్రణ అందరూ అలవాటు చేసుకోవాన్నారు. మన కోసం నిరంతరం కష్టపడుతున్న తల్లిదండ్రుల కోసం ఒక్క క్షణం ఆలోచించాలని సూచించారు. ఫోక్సో కేసుల్లో 60 శాతం మంది నిందితులు 18-20 సంవత్సరాలు లోపే వారే ఉండటం బాధాకరమని, ఇటీవల సెంట్రల్ జైల్ తనిఖీలో గంజాయి కేసుల్లో వచ్చిన వారిలో చాలా మంది చిన్నవయసు వారే ఉన్నారని ఈ సందర్బంగా మంత్రి గుర్తు చేశారు. చట్టాలపై అవగాహన లేకపోవటం వల్లనే ఇదంతా జరుగుతుందని, పోక్సో, ఇతర చట్టాలపై యువతకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు. గంజాయి యువత భవిష్యత్ ను నాశనం చేస్తుందని, దానికి యువత దూరంగా ఉండాలని సూచించారు. ఏయూలో చదవటం అదృష్టంగా భావించాలి . ఏయూలాంటి విద్యా సంస్థలో చదవటం అదృష్టంగా భావించాలని మంత్రి అనిత అన్నారు. ఇలాంటి విద్యా వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపడుతున్నామని, దానిలో భాగంగా రాజకీయాలకు అతీతంగా వీసీని నియమించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరినీ హౌస్ అరెస్టులు చేయలేదని గుర్తు చేశారు. తిరుపతిలో ఎవరిని నిర్బంధించలేదని సమావేశంలో భాగంగా పేర్కొన్నారు.విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ, ఏయూ వీసీ రాజశేఖర్ యువతకు పలు అంశాలపై ఉపదేశం చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, ఇతర విద్యా సంస్థల విద్యార్థులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

