Wednesday, April 15, 2026
Homeశివ సూర్య డైలీఉపముఖ్యమంత్రి సినిమాకు థియేటర్లు మూసేస్తారా ? ఆ నలుగురికీ మంత్రి దుర్గేష్ వార్నింగ్.. !

ఉపముఖ్యమంత్రి సినిమాకు థియేటర్లు మూసేస్తారా ? ఆ నలుగురికీ మంత్రి దుర్గేష్ వార్నింగ్.. !

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లుకు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు షాకిచ్చారు. జూన్ 12న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుండగా.. జూన్ 1 నుంచి థియేటర్లు మూసేయాలని వారు నిర్ణయించారు. ప‌ర్సంటేజ్ సిస్ట‌మ్‌లో సినిమాలు రిలీజ్ చేయాల‌ని ఎగ్జిబిట‌ర్స్ కోరుతుండగా.. నిర్మాతలు దీనికి అంగీకరించడం లేదు. దీంతో అద్దె ప్రాతిపదికన థియేటర్లు నడిపే పరిస్థితుల్లో లేమంటున్న ఎగ్జిబిటర్లు.. జూన్ 1 నుంచి దీనికి నిరసనగా థియేటర్లు మూసేయాలని నిర్ణయించారు. దీంతో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం విడుదలపై సస్పెన్స్ నెలకొంది.

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్..జూన్ 1 నుంచి థియేటర్లు మూసేయాలని నిర్ణయించిన వారిపై నిప్పులు చెరుగుతున్నారు. చిత్ర పరిశ్రమకు, ఎగ్జిబిటర్లకు, డిస్టిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకే హోం శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో విచారణ చేపడుతున్నామని ఆయన ప్రకటించారు. సినీ పరిశ్రమకు కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తున్నా.. ఇలా థియేటర్లు ఎందుకు మూసేస్తున్నారని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని థియేటర్లను తమ గుప్పిట్లో ఉంచుకున్న ఆ నలుగురినీ మంత్రి హెచ్చరించారు.

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే సినీ పరిశ్రమకు అన్ని విధాలా సహకారం అందించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలను ఆరా తీసి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చిన విషయం గుర్తుచేశారు. ఇప్పటివరకు సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ ఆకస్మాత్తుగా థియేటర్ల బంద్ అనే అంశం తెరపైకి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. దీని వెనుక ఉన్న కారణాలను ఆరా తీస్తున్నామన్నారు.

జూన్ 12వ తేదీన సినీ నటులు పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు చిత్రం విడుదలవుతున్న సందర్భంలో ఈ రకమైన వాతావరణం ఎందుకు వచ్చిందో తెలియడం లేదని మంత్రి తెలిపారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. థియేటర్ల మూసివేత అనే అంశంలో ఎవరితోనైనా చర్చించి నిర్ణయం తీసుకున్నారా అని మంత్రి ప్రశ్నించారు. ఆకస్మాత్తుగా థియేటర్లను మూసివేస్తామని నిర్ణయం తీసుకోవడానికి దోహద పడిన కారణాలేంటని అడిగారు. ఈ అంశాలన్ని తెలుసుకునేందుకే పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని, తద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
సినిమాలకు సంబంధించి టికెట్ల రేట్ల పెంపు విషయంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఏ నిర్మాత ఇబ్బంది పడకుండా తాము వెంటనే ఆమోదించి ఆయా స్థాయిల్లో టికెట్ల రేట్లు పెంచుతున్నామని మంత్రి గుర్తుచేశారు. సినిమా నిర్మాణం సమయంలో అనుమతులు త్వరితగతిన జారీ చేస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు సినీ నిర్మాతలతో మాట్లాడుతూనే ఉన్నామన్నారు. సినీ పరిశ్రమను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు. కలిసి ముందుకు వెళ్లడం కోసమే నూతన ఫిల్మ్ పాలసీ తెస్తున్నామన్నారు. ఇంత చేస్తున్నా థియేటర్ల మూసివేత ఏంటన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?