ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమవుతున్న ప్రభుత్వం.. ఇవాళ మరికొన్ని కీలక ప్రకటనలు చేసింది. ఇందులో రేషన్ కార్డు దరఖాస్తుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించినట్లు తెలిపింది. అలాగే వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు రేషన్ కార్డుల దరఖాస్తులకు ఇచ్చిన గడువును పూర్తిగా తొలగించింది. ఇది నిరంతర ప్రక్రియ అని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
నూతన రేషన్ కార్డుల దరఖాస్తు, మార్పులు చేర్పులకు గడువు లేదని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రైస్ కార్డులు అందిస్తామన్నారు. కొత్త రైస్ కార్డుల జారీలో ఎక్కడా ఎటువంటి జాప్యం లేదని, దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోపే కొత్త కార్డులు అందరికీ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గత రెండేళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదు అన్నారు. ఈకెవైసీ తప్పని సరి అని కేంద్రం స్పష్టం చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈకేవైసీ చేశామని తెలిపారు. దేశంలో 95శాతం ఈకేవైసీ పూర్తిచేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. 4.24.59,028 మందికి ఈకేవైసీ పూర్తి అయ్యింది. 22,59,498 మందికి మాత్రమే ఈకేవైసీ పూర్తికాలేదన్నారు. రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయని, దీంతో సర్వర్ స్లో కావడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చాయని, అరవై వేల మంది కొత్త రైస్ కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఉన్న కార్డు నుంచి తొలగింపు కోసం 44వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. అడ్రస్లు మార్పులు కోసం 12,500 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయానికి రైస్ కార్డుల డేటాను అనుసంధానం చేశామన్నారు. పదిహేను రోజులుగా ప్రజలు కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవమని, సర్వర్ డౌన్ కావడం, సచివాలయాల్లో అప్లికేషన్లు పూర్తిగా తీసుకోలేక పోవడం వల్ల ఇబ్బంది కలిగిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. సాంకేతికపరమైన లోపాలతో వల్ల ఇబ్బంది కలిగినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పారు. మూడు రోజులుగా కమీషనర్, ఇతర అధికారులు ఖాళీ లేకుండా పని చేస్తూ..అందరితో మాట్లాడి సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తున్నారన్నారు.
4,24,59,128 మందికి జూన్ లో తాము ఉచితంగా రైస్ కార్డులను అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. మార్పులు చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కార్డుదారుల సమాచారం డేటా బేస్ లో పెట్టి.. ప్రజలకు స్మార్ట్ రైస్ కార్డులు అందిస్తామన్నారు. రేషన్ కార్డులకు మ్యారెజ్ సర్టిఫికేట్ అవసరం లేదని, పెళ్లి సంబంధించి ఫొటో కూడా అక్కర్లేదని తెలిపారు. రైస్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి మ్యారెజ్ సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. పెళ్లి సంబంధించి పొటో కూడా అక్కర్లేదన్నారు. వాటితో సంబంధం లేకుండా దరఖాస్తులు తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. కార్డులో కొత్తగా పేర్లు ఎక్కించాలన్నా కూడా పరిశీలించి వెంటనే నమోదు చేయాలని సూచించారు. ఒక పేరు తొలగించాలంటే.. తప్పకుండా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలని, పేరు తొలగింపు సంబంధించి డెత్ కేసులకు మాత్రమే ప్రస్తుతం పరిమితం చేస్తున్నామన్నారు. ప్రజలు ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉంటే.. వారి రేషన్ కార్డులు సరైన కారణం ఉంటే డిలీట్ చేసేందుకు ఆప్షన్ ఇస్తున్నామన్నారు. రేషన్ కార్డుల్లో మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్స్ కు కూడా అవకాశం కల్పించామన్నారు. కుటుంబ సభ్యుల్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మార్పులు కూడా చేస్తున్నట్లు తెలిపారు.
క్షేత్రస్థాయిలో తమకు వస్తున్న ఫీడ్ బ్యాక్ ను బట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా మార్పులు చేస్తున్నట్టు వివరించారు. రైస్ కార్డు సరెండర్ చేయాలనుకుంటే.. కుటుంబం మొత్తం కలిపి చేయవచ్చు అని తెలిపారు. కానీ కొంతమంది ఆ కార్డులో వ్యక్తులను మాత్రమే తొలగించాలని చూస్తున్నారని, అది ఇప్పుడే సాధ్యం కాదన్నారు. వారం రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు ప్రతి నెల 5వ తేదీ లోపు వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ అందించాలని రేషన్ డీలర్లను మంత్రి కోరారు. కస్టమర్ కు మర్యాదపూర్వకమైన సేవలందించాలన్నారు. వినియోగదారులకు ఏ సమయంలో అయినా రేషన్ షాప్ నుంచి రేషన్ సరుకులు తీసుకునే విధంగా చౌక ధర దుకాణాలు అందుబాటులో ఉండాలని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.ఎండీయూ వాహనాలను తొలగించడం ద్వారా రేషన్ మాఫియాను అరికట్టకలిగామన్నారు. ప్రతి రేషన్ షాపు వద్ద సీసీ కెమెరా విధిగా ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో 30 వేల మందితో అతిపెద్ద కుటుంబంగా రేషన్ దుకాణదారులతో సివిల్ సప్లై కార్పొరేషన్ కు అనుబంధం ఉందన్నారు. కార్డుదారులకు ఇబ్బందులు తప్పించడానికి వారు కోరినప్పుడు కోరిన విధంగా కోరిన సమయంలో రేషన్ తీసుకునే వెసులుబాటు రేషన్ దుకాణం ద్వారానే సాధ్యమని గుర్తించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఎండీయూ వ్యవస్థని రద్దు చేశారని గుర్తు చేశారు. ఒక ప్లానింగ్ ప్రకారం రేషన్ షాపు వద్ద ఎక్కువ మంది జనాలు నిలబడకుండా రేషన్ పంపిణీ చేయడానికి డీలర్లు సిద్ధంగా ఉండాలని మంత్రి తెలిపారు. పంపిణీ సక్రమంగా జరగడానికి వీలుగా కార్డుదారులకి గతంలో కంటే మెరుగైన సేవలు అందించడానికి వీలుగా రేషన్ డీలర్లు వాట్స్అప్ గ్రూపులు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్డులో ఒంటరిగా ఉన్న వృద్ధులు వికలాంగులు బెడ్రీడెన్ ఉన్నవారికి సంబంధించి ఒక వాట్స్ అప్ గ్రూప్, మిగిలిన కార్డుదారులతో కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని సూచించారు. రేషన్ పంపిణీ లో కార్డుదారులకు ఇబ్బంది కలిగించే రీతిలో వ్యవహరించిన డీలర్లపై కఠినమైన చర్యలు తీసుకొని పంపిణీ బాధ్యతలను విఆర్వోలకు అప్పగిస్తామని హెచ్చరించారు. ఇంటి వద్ద రేషన్ ఇవ్వడానికి కాటా తో సంబంధం లేకుండా ఈపాస్ లోనే వాళ్ళకి సరుకులు అందే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. తక్కువ తూకం ఇచ్చినా ఎక్కువ ధరలు వసూలు చేసినటువంటి వారిని తొలగిస్తామని హెచ్చరించారు.

