Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీసరిహద్దు భద్రతకు జవాన్ – ఆహార భద్రతకు కిసాన్

సరిహద్దు భద్రతకు జవాన్ – ఆహార భద్రతకు కిసాన్

జయజయహే : దేశ రక్షణలో జవాన్, దేశ పోషణలో కిసాన్. ఒకరిది భూమి కోసం సాహసం, మరొకరిది భూమితో సహవాసం. సైనికుడు సరిహద్దుల్లో విపత్కర పరిస్థితుల్లో అయినవారిని ఆత్మీయులను వదిలి శత్రువులపై నిరంతరం యుద్ధం చేస్తే ..రైతు పుడమి ఒడిలో ప్రకృతి బడిలో విత్తనాలనే అక్షరాలతో స్వేదం విడిచి సాగు యుద్ధం సాగిస్తాడు. దేశానికి నిస్వార్థంగా సేవ చేసే ఈ ఇద్దరి ప్రస్థానం అందరికి ఎంతో గర్వకారణం

ఆపరేషన్ సింధూర్ – సలాం సైనికా

ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్ర మూకలను మట్టు పెట్టింది. ఈ ఆపరేషన్ లో మురళి నాయక్ లాంటి జవాన్లు ప్రాణాలను పణంగా పెట్టి, దేశభద్రత కోసం పోరాడిన విధానం చేసిన త్యాగం మాటల్లో చెప్పలేనిది. ఇంకా ఎంతో మంది మహిళ సైనికులు కూడా యుద్ధ భూమిలో వారి తెగువను చూపిస్తున్నారు వీరందరి ధైర్య సాహసాలు ఎందరికో స్పూర్తి దాయకం . ఇలాటి ఎన్నో సందర్భాల్లో, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా కూడా దేశ రక్షణ కోసం ముందుండి నిలబడే ఒకే ఒక్కరు సైనికులు

జవాన్ – సరిహద్దుల సంరక్షకుడు

సైనికుడి జీవితం త్యాగానికి, క్రమశిక్షణకు నిదర్శనం, వున్న వూరినీ అయిన వారిని అందర్నీ వదిలేసి దేశ రక్షణకు ముందుండి. ఎండకు వానాకు మంచుకు తట్టుకుని ఎన్ని కఠోర పరిస్థితులు వచ్చినా యుద్ధం వచ్చినా వెనక్కి తగ్గకుండా దేశపు ప్రతి అంగుళాన్ని కాపాడేందుకు నిద్రలేని రాత్రులు గడుపుతూ. దేశ భద్రత కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాగం చేసే ధైర్య వంతుడు జవాన్

కిసాన్ – దేశానికే అన్న ప్రధాత

రైతు దేశ ప్రజల కడుపు నింపే దేవుడు. అతని చేతుల్లోనే అందరి జీవితం, అతడు స్వేదం చిందించి సేద్యం చేస్తేనే అందరికి ఆహారం. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు,పెరిగిన పెట్టుబడి ఖర్చులు, ధరల లేమి లాంటి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ, దేశానికి ఆహారాన్ని అందించేందుకు రైతు నిత్యం కృషి చేస్తాడు. అతని శ్రమకి వెలకట్టలేము

జవాన్ – కిసాన్: దేశానికి మూల స్తంభాలు

సైనికుడు లేకపోతే దేశం శత్రువుల ఆక్రమణలోకి వెళుతుంది. అన్నదాత లేకపోతే ప్రజలు ఆకలితో అలమటించాల్సి పరిస్థితి. ఒకరు దేశానికి రక్షణ గోడగా నిలిస్తే, మరొకరు దేశానికి కావలసిన ఆహారాన్ని అందిస్తాడు. ఇద్దరూ దేశానికి వెలకట్టలేని సంపద వారిని గౌరవించుకోవడం, వారి పట్ల బాధ్యతగా ఉండడం అందరి కర్తవ్యం

వారి పట్ల సమాజ బాధ్యత

దేశం వీరి మీద ఆధార పడినప్పుడు , దేశం కోసం వీరు ఎంతో చేస్తున్నపుడు, అందరూ కూడా వారి పట్ల బాధ్యతగా ఉండాలి. జవాన్లకు గౌరవం ఇవ్వడం, వారికి ఆర్థిక భరోసాను, భద్రతను కల్పించడం, వారి ఆస్తులకు రక్షణ కల్పించడం, వారి కుటుంబాలకు భరోసానివ్వడం,పింఛన్లు లాంటివి వారి త్యాగాలకు కొంతమేర అయినా ఉపశమనం కల్పిస్తాయి

రైతులను గౌరవించడం, వారికి ఆర్థిక భద్రత, పంటలకు మద్దతు ధరలు, రైతు భీమాలు, ప్రభుత్వ రాయితీలు కల్పించడం, రైతులకు పింఛన్లు ఇవ్వడం, రైతు కుటుంబాలకు భరోసా కల్పించడం వంటివి రైతుల ఆర్థికాభివృద్ధికి చేయూత నిస్తాయి. ఇవన్నీ సమాజంగా, ప్రభుత్వంగా అందరూ కలసి చేయాల్సిన కనీస బాధ్యత

జై జవాన్, జై కిసాన్ – నినాదం మాత్రమే కాదు అది భారతదేశపు విధానం, వారి పట్ల దేశ ప్రజలకు వున్న అభిమానం

జై జవాన్, జై కిసాన్

జి. అజయ్ కుమార్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?