Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీకీ||శే|| పబ్బరాజు వెంకటేశ్వరరావు చిరస్మరణీయులు - జనచైతన్య వేదిక

కీ||శే|| పబ్బరాజు వెంకటేశ్వరరావు చిరస్మరణీయులు – జనచైతన్య వేదిక

జయజయహే : కీర్తిశేషులు పబ్బరాజు వెంకటేశ్వరరావు 1996లో శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితి గుంటూరులో స్థాపించి వందలాది పేద, అంధ విద్యార్థులకు భోజన, వసతి తోపాటు విద్యను అందించిన మహనీయులు అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ఈనెల 3వ తేదీన కీ||శే|| పబ్బరాజు వెంకటేశ్వరరావు 4వ వర్ధంతి గుంటూరులోని శ్రీ షిరిడి సాయి దీనజన సేవాసమితి అంధుల, వికలాంగుల, అనాధల శిక్షణాలయంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు వెలగపూడి పాండురంగారావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ మానవ సేవే మాధవ సేవ అని గుర్తించి కీ||శే|| పబ్బరాజు వెంకటేశ్వరరావు 1996లో శ్రీ షిరిడి సాయి దీన జన సేవా సమితిని స్థాపించి గత 29 సంవత్సరాలుగా అంధులైన వందలాది విద్యార్థులకు ఉచితంగా భోజన వసతితో పాటు విద్యను అందించి చిరస్మరణీయులైనారు అని తెలిపారు. బ్రెయిలీ లిపితోపాటు ఆడియో క్యాసెట్స్ ద్వారా 10వ తరగతితో పాటు ఉచితంగా విద్యను కంప్యూటర్ శిక్షణ పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇవ్వడం లాంటి కార్యక్రమాలకు అంధ విద్యార్థులకు సేవలు అందించిన మహనీయులు కీ||శే|| పబ్బరాజు వెంకటేశ్వరరావు అని కొనియాడారు. పోటీ పరీక్షల శిక్షణ ద్వారా 43 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని గుర్తు చేశారు. అంధునిగా ఉంటూ తన ప్రతిభతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కోటిరెడ్డి ప్రసంగిస్తూ పట్టుదల, క్రమశిక్షణ, నిబద్ధతతో కృషి చేస్తే అంధత్వం అభివృద్ధికి అడ్డుకాదన్నారు. అంధులైనప్పటికీ అనితర కృషితో హెడ్ మాస్టర్ గా అభివృద్ధి చెందిన నల్లపు రామకృష్ణారెడ్డి ప్రసంగిస్తూ బ్రెయిలీ లిపి తో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని విద్యతోపాటు అన్ని రంగాలలో అంధులు సైతం అత్యున్నత స్థాయికి ఎదిగిన వారు ఎందరో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి దీనజన సేవాసమితి కార్యదర్శి పి.ఎస్. మూర్తి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణుభట్ల జయ, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నేత ఎన్. తిరుపతయ్య తదితరులు ప్రసంగించారు. తొలుత కీర్తిశేషులు పబ్బరాజు వెంకటేశ్వరరావు చిత్రపటానికి వక్తలు, అతిథులు, పూల మాలలు వేసి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?