Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీజీవన ఎరువులు – వ్యవసాయానికి జీవ నాడులు

జీవన ఎరువులు – వ్యవసాయానికి జీవ నాడులు

జయజయహే : భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలకమైన పాత్ర పోషిస్తుంది. కానీ గత కొన్ని దశాబ్దాలుగా హరిత విప్లవం తరువాత హైబ్రిడ్ వంగడాల రాకతో అధిక దిగుబడుల ఆశతో రైతులు పరిమితికి మించి రసాయన ఎరువులను వాడడం మొదలు పెట్టారు ఆధారపడటం మొదలుపెట్టారు. దీని వల్ల తాత్కాలికంగా దిగుబడుల పెరిగినా నేల సారవంతత సహజ ఉత్పాదకత తగ్గిపోయింది. మట్టిలో జీవకణాలు తగ్గుతూ అవి జరిపే రసాయన చర్యలపై గణనీయంగా మార్పులు వచ్చాయి తద్వారా భూమి సజీవ శక్తిని కోల్పోతూ వస్తుంది మళ్ళీ దీనిని పునరుద్ధరించాలంటే రసాయన వ్యవసాయం తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలి సేంద్రియ వ్యవసాయంలో జీవన ఎరువుల పాత్ర చాలా ప్రముఖమైనది..

జీవ ఎరువులు అంటే ఏమిటి?

జీవ ఎరువులు అనేవి సూక్ష్మజీవుల ఆధారంగా తయారవుతాయి. ఇవి మట్టిలో జీవకణాల వృద్ధికి దోహదపడతాయి. మొక్కలకు అవసరమైన పోషకాల్ని సహజంగా అందిస్తాయి. రసాయనాల వాడకాన్ని తగ్గిస్తాయి. ఇవి ముఖ్యంగా బ్యాక్టీరియా, ఫంగస్, ఆల్గే వంటి జీవులతో తయారవుతాయి.

జీవ ఎరువుల రకాలు & వాటి ప్రత్యేకతలు

నత్రజని స్థిరీకరణ సూక్ష్మజీవులు: అజోస్పిరిల్లం, అజటోబాక్టర్, రైజోబియం వంటివి వాతావరణంలోని నత్రజనిని మట్టిలోకి మలచి మొక్కలకు అందిస్తాయి.

ఫాస్ఫరస్ మొబిలైజింగ్ సూక్ష్మజీవులు: ఫాస్ఫోబాక్టీరియా, బ్యసిల్లస్ మెగాటీరియమ్ వంటివి అందుబాటులో లేని ఫాస్ఫరస్‌ను మొక్కలు గ్రహించగలిగే రూపంలోకి మార్చుతాయి.

పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా: మట్టిలో ఉన్న పొటాష్‌ను మొక్కలు గ్రహించేందుకు సహాయపడతాయి.

మైకోరైజా: మొక్కల వేర్లతో సహజీవనం చేస్తూ, పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. వేర్ల చుట్టూ రక్షణ పొరను ఏర్పరచి, మట్టి ద్వారా వచ్చే వ్యాధులను అడ్డుకుంటుంది.

మిశ్రమ జీవ ఎరువులు (బయో NPK): విభిన్న సూక్ష్మజీవాలను కలిపి తయారుచేసే మిశ్రమం ఇవి మల్టీ ఫంక్షనల్‌గా పనిచేస్తాయి. విత్తన శుద్ధిలో, వేరు ముంచడంలో, నీటితో కలిపి డ్రిప్ ద్వారా ఈ జీవ ఎరువులను వాడవచ్చు.

ఇతర ముఖ్యమైన జీవ ఉత్పత్తులు:

జీవ శిలీంద్ర నాశకాలు: ట్రైకోడెర్మా విరిడీ, సుడోమోనాస్ ఫ్లోరోసెన్స్ – శిలీంద్ర వ్యాధులను అరికడతాయి.

జీవ బ్యాక్టీరియా నాశకాలు: బాసిల్లస్, స్ట్రెప్టోమైసీస్ – బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తాయి.

జీవ పురుగుమందులు: బవేరియా, మెటారిజం, వెర్టిసెలియం, వేప ఆధారిత ఉత్పత్తులు, NPV(న్యూక్లియర్ పాలీహైడ్రోసిస్ వైరస్ ను నియంత్రించేందుకు సహజ మార్గాలు. జీవ సూది పురుగు నియంత్రకాలు (బయో నెమటోసైడ్స్) పాసిలోమైసిస్ – వేర్లపై దాడి చేసే సూదిపురుగుల నివారణకు. జీవ కలుపు మందులు (బయో హెర్బిసైడ్స్) కొలటుట్రైకం – కలుపు మొక్కల నియంత్రణకు (ఇప్పటికీ పరిశోధన దశలో ఉంది). మొక్కల వృద్ధికి సహాయ పడే జీవులు (PGPR): అజోస్పైరిల్లం, బాసిల్లస్ – వేరు అభివృద్ధికి, వృద్ధికి సహకరిస్తాయి. జీవ వృద్ధి ప్రేరకాలు (బయో స్టిములెంట్స) సముద్రపు నాచు, హ్యూమిక్ యాసిడ్ – పూత, ఫలాల పరిపక్వతను వేగవంతం చేస్తాయి.

జీవ వికర్షకాలు(బయో రెప్పలెంట్స్ ) నీమ్ ఆయిల్, వెల్లులి మిశ్రమం – పురుగులను దూరంగా ఉంచుతాయి.

జీవ ఉత్పత్తుల ప్రయోజనాలు: మట్టికి జీవం పోస్తాయి: జీవకణాల పెరుగుదల ద్వారా మట్టిని సారవంతంగా మార్చతాయి. మొక్కలకు పోషకాల లభ్యత పెరుగుతుంది: నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ వంటి మూలికలను మొక్కలు బాగా గ్రహిస్తాయి. వేర్ల అభివృద్ధి మెరుగవుతుంది: వేర్ల పొడవు, వ్యాప్తి పెరిగి మొక్కల స్థిరత్వం పెరుగుతుంది.

వ్యవసాయ వ్యయం తగ్గుతుంది: రసాయన ఎరువుల ఖర్చు తగ్గి, రైతుకు ఆదాయం పెరుగుతుంది. పర్యావరణ హితం:

మట్టి, నీరు, గాలిని కలుషితం చేయవు. ప్రకృతిని కాపాడతాయి. సేంద్రియ వ్యవసాయానికి మౌలికం: జీవ రువుల్లేకుండా సేంద్రియ వ్యవసాయం సాధ్యం కాదు. జీవ ఎరువులు రైతు భవిష్యత్తుకు వెలకట్టలేని పెట్టుబడి. ఇవి భూమికి జీవం, పంటలకు పోషణ, రైతుకు లాభం, సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారం అందించే మార్గం. రైతులు ప్రకృతితో సమన్వయంగా సాగు చేయాలంటే, జీవ ఉత్పత్తులు మార్గదర్శకంగా నిలుస్తాయి. సారవంతమైన భూమి – సమృద్ధిగా పంట – ఆరోగ్యకర సమాజం” అనే లక్ష్యంతో ప్రతి రైతు జీవ ఉత్పత్తులను పంటలకు వాడాలి. జీవన ఎరువులే రైతుల జీవితాలలో వెలుగులు నింపే వనరులు మట్టిలో జీవం వుంటేనే మనిషికి జీవితం వుంటుంది

జి. అజయ్ కుమార్

వ్యవసాయ నిపుణులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?