Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు

మేజిక్ ఫిగర్ కోసం దిగజారిపోయారు
బెదిరింపులకు పాల్పడి గెలిపొందారు
వైసీపీ నేతలు కన్నబాబు, అమర్ మండిపాటు

విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో కూటమి పార్టీలు అడ్డదోవలో గెలిచి, నైతికంగా మాత్రం ప్రజల ముందు ఓటమి పాలయ్యారని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నాబాబు, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌, ఎమ్మెల్సీలు కుంభా ర‌విబాబు, వ‌రుదు క‌ళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ, తైనాల విజయ్‌కుమార్‌, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర లు అవిశ్వాస తీర్మానం తరువాత విశాఖపట్నం సిటీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ అవిశ్వాస తీర్మానం సాక్షిగా కూటమి పార్టీల కుట్రలు, కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయని అన్నారు. అధికార బలంతో వైయస్ఆర్‌సీపీ కార్పోరేటర్లను ప్రలోభాలకు గురిచేసి, బెదిరింపులతో భయపెట్టి తమకు అనుకూలంగా ఓటు వేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూని చేశారని ‌తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

మేజిక్ ఫిగర్‌ కోసం దిగజారిపోయారు – కన్నబాబు

కేవ‌లం కుట్ర‌లు, కుతంత్రాల‌ను న‌మ్ముకుని విశాఖ మేయ‌ర్ స్థానాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని కూట‌మి పార్టీలు నెల‌రోజులుగా అడ్డ‌దారులు తొక్కాయి. కోరుకున్న‌ట్టుగానే 74 మంది కార్పొరేట‌ర్ల బ‌లంతో ఈ మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకున్నామ‌ని సంబ‌ర ప‌డుతున్నారు. చావు బ‌తుకుల మ‌ధ్య వారు మేజిక్ ఫిగ‌ర్‌ను చేరుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చావుత‌ప్పి క‌న్న‌లొట్ట‌ పోయిన‌ట్ట‌యింది. అన్ని ప్ర‌య‌త్నాలు చేసినా 74 కే ప‌రిమితం అయ్యారు. కూట‌మి పార్టీలు ఎన్ని ఒత్తిళ్లు చేసినా, బెదిరింపులు దాడులు చేసినా పార్టీకి అండ‌గా నిలిచిన వైయ‌స్సార్సీపీ కార్పొరేట‌ర్ల‌కు చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నా. మ‌హిళా కార్పొరేట‌ర్లు చూపించిన తెగువ‌కు ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నా. పార్టీకి అండ‌గా నిలిచిన ప్ర‌తి ఒక్క కార్పొరేటర్‌కి రాబోయే రోజుల్లో స‌ముచిత స్థానం ఉంటుంది. వైయ‌స్సార్సీపీలోనే ఉన్న కార్పొరేట‌ర్ల అంతు చూస్తామ‌ని ఇప్ప‌టికీ బెదిరిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర‌కు అలాంటి సంస్కృతిని తీసుకురావొద్ద‌ని హెచ్చ‌రిస్తున్నా. విశాఖ మేయ‌ర్ స్థానాన్ని ద‌క్కించుకునేందుకు కూట‌మి పార్టీలు తొక్కిన అడ్డ‌దారులు చూస్తే, అసహస్యం వేస్తోందన్నారు.

ప్ర‌జ‌ల్లో విశ్వాసాన్ని కోల్పోయారు – గుడివాడ అమర్

గ్రేటర్ విశాఖ మేయ‌ర్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం కోసం 74 మంది స‌భ్యులు అవ‌స‌ర‌మైతే అతిక‌ష్టం మీద ఆ ఫిగర్‌ను అందుకోగలిగారు. నిన్న‌మొన్న‌టి దాకా కూటమి పార్టీలు తమ వ‌ద్ద 80 నుంచి 85 మంది కార్పోరేటర్లు ఉన్నారంటూ చేసిన ప్ర‌చారమంతా ఉత్త‌దేన‌ని తేలిపోయింది. గ‌త నెల 21న అవిశ్వాస తీర్మానం మీద లేఖ ఇచ్చిన‌ప్పుడే వారికి ఆ బ‌లం లేద‌ని అంద‌రికీ తెలుసు. ఏదొరకంగా మా స‌భ్యుల‌ను ప్ర‌లోభ‌పెట్టి, బెదిరించి, భ‌య‌పెట్టి లాక్కోవ‌చ్చ‌నే ఆలోచ‌న‌తోనే అవిశ్వాసం కోసం లేఖ ఇచ్చార‌ని అర్థ‌మ‌వుతుంది. ఇలా అడ్డ‌దారిలో గెలిచిన కూట‌మి పార్టీ నాయ‌కులు నిజం గెలిచింది, ధ‌ర్మం గెలిచింది, న్యాయం గెలిచింది అంటూ పచ్చి అబద్దాలను వల్లేవేస్తున్నారు. సొంత స‌భ్యుల బ‌లంలేకోపోయినా అడ్డదారిలో గెలిచి, న్యాయం, ధ‌ర్మం గురించి మాట్లాడ‌టం హాస్యాస్ప‌ద‌ం. వారు గెలిచింది కేవ‌లం మేయ‌ర్ పీఠం మాత్ర‌మే. విశాఖ ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని, విశ్వాసాన్ని వారు కోల్పోయారు. దాదాపు 27 మంది వైయ‌స్సార్సీపీ కార్పొరేట‌ర్ల‌ను సంత‌లో ప‌శువుల‌ను కొన్న‌ట్టు కొన్నారు. వ్యాపారాల‌ను నాశ‌నం చేస్తామ‌ని బెదిరించి కొంత‌మంది లాక్కున్నారని ఆరోపించారు.

ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేశారు – ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి

కూట‌మి పాల‌న చూస్తుంటే ప్ర‌జాస్వామ్యంలో ఉన్నామా? రాజ‌రికంలో ఉన్నామా ? అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. ప్ర‌జాస్వామ్యాన్ని, విలువ‌ల‌ను అప‌హాస్యం చేసేలా మేయ‌ర్ అవిశ్వాస తీర్మానం ప్రక్రియ జ‌రిగింది. మా పార్టీ నుంచి గెలిచిన కార్పొరేట‌ర్ల‌ను భ‌య‌పెట్టి, ప్ర‌లోభపెట్టి ఓటేయించుకున్నారు. రాజ‌కీయంగా వాళ్ల‌కు వాళ్లే స‌మాధి క‌ట్టుకున్నారు. అధికారంలోకి వ‌చ్చాక ఎదుట పార్టీ నాయ‌కుల‌ను తీసుకోబోమ‌ని చెప్పి, కేవ‌లం 10 నెల‌ల మేయ‌ర్ పీఠం కోసం మా కార్పొరేటర్ల‌ను పెట్ట‌ని ఇబ్బంది లేదు. ద‌మ్ము ధైర్యం ఉంటే మా పార్టీ నుంచి తీసుకున్న 27 మంది కార్పొరేట‌ర్ల‌తో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తుల మీద గెలిపించి, మేయర్ పదవిని దక్కించుకోవాలి. బీసీ మ‌హిళ‌ను దించిన పార్టీలుగా తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన చ‌రిత్ర‌లో మిగిలిపోతాయి. అధికారంలో ఉన్నా లేక‌పోయినా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వైయ‌స్సార్సీపీ పోరాడుతూనే ఉంటుందిని హెచ్చరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?