ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో బాంబు కలకలం నెలకొంది. స్థానిక బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ భవనంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు.. అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్ ను సంఘటన స్థలానికి రప్పించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో బెజవాడ వాసుల్లో టెన్షన్ మొదలైంది.
దీంతో బీసెంట్ రోడ్డులోని దుకాణాలు, కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేయించారు. ట్రాఫిక్ ను సైతం మళ్లించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అలానే పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తిని సైతం ట్రేస్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇటీవల దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల రీత్యా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.