సింహాచలం: జయజయహే : సింహాచలం కొండపై గోడ కూలిన ప్రమాదంలో మరణించిన యడ్ల వెంకట్రావు కుటుంబ సభ్యులను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం పరామర్శించారు. వెంకట్రావు స్టీల్ ప్లాంట్ ఉద్యోగి కాగా, భార్య వరలక్ష్మి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఉద్యోగిని. అడవివరంలో నివాసముంటున్న వెంకట్రావు సింహాద్రి అప్పన్న నిజ రూప దర్శనం కోసం బుధవారం తెల్లవారుజామున రూ.300 క్యూ లైన్ లో నిలబడి గోడ కూలిన కారణంగా మృతి చెందిన విషయం విదితమే. ప్రభుత్వం తరపున వెంకట్రావు కుటుంబానికి అండగా ఉంటామని గంటా ధైర్యం చెప్పారు. స్వస్థలమైన చోడవరం నుంచి ఉద్యోగార్థం విశాఖలో స్థిరపడ్డామని వారు తెలిపారు. దేవస్థానం ఇచ్చే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని వెంకట్రావు సోదరుడికి ఇచ్చేలా చూడాలని కోరగా, అధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆయన వెంట స్థానిక కార్పొరేటర్ పి.వి. నరసింహం, టీడీపీ నాయకులు పంచదార్ల శ్రీనివాస్, గుసిడి శంకర్రావు, గాడు అప్పలనాయుడు, గరే గుర్నాథ్ తదితరులు ఉన్నారు.


