Saturday, April 11, 2026
Homeభక్తిపేదలకు నాణ్యమైన వైద్యం కేజీహెచ్ లో ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ విశాఖ జిల్లా...

పేదలకు నాణ్యమైన వైద్యం కేజీహెచ్ లో ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డా. డోలా

జయజయహే : పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు తగ్గట్టుగా వైద్యాధికారులు పనిచేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డా. డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, మాజీ ఎమ్మెల్సీ దువారపు రామారావు, లతో కలసి కేజీహెచ్ ను ఇన్ ఛార్జ్ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఓపి, హెల్ప్ డెస్క్ కౌంటర్లను మంత్రి పరిశీలించారు. అనంతరం క్యాజువాలిటీ, మందుల పంపిణీ విధానము, రోగులకు మందులు ఇచ్చే స్థలం, మత్తు పదార్థాల విమోచన కేంద్రం ( మానసిక వైద్య విభాగం), ఎండోక్రైనాలజీ, గైనకాలజీ విభాగం, భావనగర్ వార్డు, రాజేంద్రప్రసాద్ వార్డు, పిల్లల వార్డులను మంత్రి తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆసుపత్రి ఆవరణలో శానిటేషన్, సెక్యూరిటీ, రోగులతో పాటు సహాయంగా వచ్చే వారికి అందుతున్న అవసరాలను గురించి అడిగి తెలుసుకున్నారు.

కె జి హెచ్ లో అన్ని విభాగాలు పరిశీలించి రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్యం, ఇతర సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్న అనంతరం వైద్యులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి వార్డులో ఎలక్ట్రికల్ మరియు ఫైర్ సేఫ్టీ చాలా ముఖ్యమన్నారు. ఎమర్జెన్సీ మందులు మరియు ఇంజక్షన్స్ ఎల్లవేళలా రోగులకు అందుబాటులో ఉంచుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రతి వార్డులో డ్యూటీ డాక్టర్ల పేరుతోపాటు డ్యూటీ రోష్టర్ ఉంచాలన్నారు. వార్డులలో శానిటేషన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, శానిటేషన్ మరియు సెక్యూరిటీ మరింత సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వార్డులలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గాలి వెలుతురు సక్రమంగా ఉండేలా చూడాలని మంత్రి తెలిపారు. ఓపి దగ్గర మహిళలకు ఫీడింగ్ రూమ్, చిల్డ్రన్స్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కేజీహెచ్ సూపరిండెండెంట్ ను ఆదేశించారు. ఆసుపత్రిలో బర్త్ సర్టిఫికెట్ మంజూరు తో పాటు శిశు ఆధార్ నమోదు వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. విశాఖ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి వైద్యం కోసం నిరుపేదలు, ఆర్థిక స్తోమత లేని వారు వస్తారని, అటువంటి వారి నుంచి ఎవరైనా సిబ్బంది నగదు ఆశించినట్లయితే అటువంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యానికి అనుగుణంగా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని తెలిపారు. ఆస్పత్రికి వచ్చే రోగులతో సిబ్బంది ఆప్యాయంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఇన్చార్జి మంత్రి తెలిపారు. ఆస్పత్రిలో శిశు మార్పిడిలు జరగకూడదని, అటువంటి సంఘటనలు జరిగితే అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రి అంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆసుపత్రిలో అవసరమైన అదనపు భవనాలు నిర్మిస్తామని, అదేవిధంగా సిబ్బందిని నియమిస్తామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?