SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 12 April 2025, 11:22 am Posted by : SHIVASURYA NEWS

సినీ హబ్ గా విశాఖ- ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కి భూమి కేటాయిస్తాం – భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్టూడియో స్థాపనకు అల్లు అరవింద్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ల ఆసక్తి

విశాఖపట్నం, జయజయహే : సినిమా పరిశ్రమను తరలించడం ద్వారా విశాఖను సినీ హబ్ గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. హైదరాబాద్ లో సినీ పరిశ్రమ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేయడం కూడా దీనికి ఒక కారణంగా పేర్కొన్నారు. కేవలం ఒక క్లబ్ గానే కాకుండా సినీ సాంకేతిక నిపుణులకు ఇక్కడ శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన ఉందని తెలిపారు. తిమ్మాపురం సమీపంలోని ఫిల్మ్ నగర్ సెంటర్ ను శనివారం సందర్శించిన ఆయన తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. తగిన మౌలిక సౌకర్యాలు కల్పిస్తే విశాఖ రావడానికి అనేకమంది నటీనటులు ఆసక్తి చూపిస్తున్నారని, ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. అల్లు అరవింద్ వంటి స్టార్ట్ ప్రొడ్యూసర్ లు స్టూడియో స్థాపనకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో ఏ క్లబ్ లో లేని విధంగా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కోర్ కమిటీ సభ్యుల తదనంతరం వారి వారసులు ఆ పదవుల్లో ఉండేలా నిబంధనలు మార్చుకున్నారని విమర్శించారు. విశాఖలో ప్రతిష్టాకరమైన వాల్తేర్ క్లబ్, గోల్ఫ్ క్లబ్, సెంచురీ క్లబ్ వంటి క్లబ్ లు అనేక ఏళ్లుగా నడుస్తున్నా, ఫిల్మ్ నగర్ సెంటర్ లా ఎప్పుడూ వివాదాస్పదం కాలేదన్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కోసం గతంలో తొట్లకొండపై ప్రభుత్వమిచ్చిన 10 ఎకరాల భూమిపై పురావస్తు శాఖ అభ్యంతరం వ్యక్తపరచడంతో వెనక్కి తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సినీ పరిశ్రమకు చెందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించి సెంటర్ కు అవసరమైన భూమిని కేటాయించేలా చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ హయంలో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. వైసీపీ హయంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ను రాజకీయ పునరావాస కేంద్రంగా తయారు చేశారని గంటా మండిపడ్డారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా తనపై ఉందన్నారు. మధ్యతరగతికి సైతం అందుబాటులో ఉండేలా సభ్యత్వ రుసుం నిర్ణయించిన సెంటర్ లో ఎలాంటి వివాదాలు లేకుండా ఉండాలనే ఆలోచనతో పాత కమిటీని రద్దు చేసి, కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని సభ్యులు నిర్ణయించారని వివరించారు. రాజకీయాలకు, గ్రూపులకు తావు లేకుండా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ను అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విశాఖ అధ్యక్షుడిగా, ఐటీ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం తనకుందని, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ను ఉన్నతమైన క్లబ్ గా తీర్చి దిద్దాలనే ఉద్దేశంతో అధ్యక్షుడిగా పోటీలో నిలిచానని తెలిపారు.