యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఏటా నిర్వహించే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(IFS) పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారిక వెబ్‌సైట్ లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను అందుబాటులో ఉంచింది. అయితే ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు.
దేశవ్యాప్తంగా మొత్తం 150 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టింది యూపీఎస్‌సీ. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చాడ నిఖిల్ రెడ్డి దేశవ్యాప్తంగా 11వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిఖిల్ రెడ్డి టాప్ ప్లేస్ లో ఉన్నారు.ఆ తర్వాత లిస్టులో యెదుగూరి ఐశ్వర్యారెడ్డి 13, జి.ప్రశాంత్ 25,, చెరుకు అవినాశ్ రెడ్డి 40, చింతకాయల లవకుమార్ 49, అట్ల తరుణ్‌తేజ 53, ఆలపాటి గోపినాథ్ 55, కె. ఉదయకుమార్ 77, టీఎస్ శిశిర 87 ర్యాంకులను సాధించి తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చాడ నిఖిల్ రెడ్డి దేశవ్యాప్తంగా 11వ ర్యాంకు సాధించారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించినట్లు నిఖిల్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు చాడ శ్రీనివాస్‌రెడ్డి, సునంద దంపతుల కుమారుడు నిఖిల్‌రెడ్డి. ఆయన దిల్లీ ఐఐటీలో 2018లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
ఆ తర్వాత ఏడాదిన్నరపాట సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశారు. అనంతరం సివిల్ సర్వీసెస్ పై మక్కువతో కోచింగ్ తీసుకుని పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. చిన్నతనం నుంచి అమ్మానాన్నలు తనను అన్ని విధాలుగా ప్రోత్సహించారని నిఖిల్ రెడ్డి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక కనికా అనబ్ దేశవ్యాప్తంగా మొదటి ర్యాంక్ సాధించారు. రెండో స్థానంలో కందేల్వాల్ ఆనంద్ అనిల్ కుమార్, మూడో స్థానంలో అనుభవ్ సింగ్ ఉన్నారు.


