SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 21 April 2025, 5:54 am Posted by : SHIVASURYA NEWS

వాడవాడలా పూజలు చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకల హోరు రాష్ట్రమంతటా ఘనంగా సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు నక్కపల్లి హోం మంత్రి అనిత క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత 75 కిలోల కేక్ కట్ చేసి, సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం పుట్టినరోజు నేపథ్యంలో పేదలకు అన్నసమారాధన నిర్వహించి, స్వయంగా భోజనాలు వడ్డించారు మంత్రి అనిత. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ నాకు దైవ సమానులైన చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుతున్నానని అన్నారు. చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని, ఆయన హయాంలో పని చేయడం నా పూర్వజన్మ సుకృతమని చెప్పారు. భావితరాల భవిష్యత్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న యోధుడు చంద్రబాబు అన్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ ప్రజలకు అండగా నిలిచారని, హుద్‌హుద్ వంటి విపత్తుల సమయంలో కూడా ఆయన ప్రజలకు తోడుగా నిలిచారు అని గుర్తు చేశారు. నేను చంద్రబాబుగారికి ఏకలవ్యశిష్యురాలినని, ఆయన్ను చూసి నేర్చుకుంటున్నానని చెప్పారు. రాబోయే తరాలకు చంద్రబాబు ఒక స్ఫూర్తిదాయకమన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, బంగారు కుటుంబంతో ప్రజల సంక్షేమం కోసం ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు అని మంత్రి అనిత పేర్కొన్నారు.

ఉపమాక వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా, ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో దేవస్థానం అధికారులు, అర్చకులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి అనిత 101 కొబ్బరికాయలు కొట్టి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. పూజ అనంతరం వేద పండితులు మంత్రికి ఆశీర్వచనాలు చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.