Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీఏపీలో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వానలు కురిసే అవకాశం .. విపత్తు నిర్వహణ...

ఏపీలో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వానలు కురిసే అవకాశం .. విపత్తు నిర్వహణ సంస్థ

ఆంధ్రప్రదేశ్‌ వాతావరణం గురించి.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కీలక విషయాలు వెల్లడించింది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురవనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ప్రస్తుత వేసవికాలంలో ఎండలు ఎంత దంచుతున్నాయో అదే స్థాయిలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అదే పరిస్థితి నెలకొంది. పగలు భానుడి భగభగలతో జనం అల్లాడిపోతూ ఉండగా.. సాయంత్రం, రాత్రి వేళల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో నేడు(శనివారం) పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏపీఎస్‌డీఎంఏ) తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు.

అదే సమయంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. పిడుగులు పడే, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. చెట్ల కింద.. పాత గోడలు, భవనాల వద్ద ఉండవద్దని అధికారులు సూచించారు.

మరోవైపు శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రాజధాని అమరావతి తడిసి ముద్దయింది. శాశ్వత సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీల నిర్మాణాల కోసం తీసిన పునాదుల్లో వర్షపు నీరు చేరినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. దీంతో సిబ్బంది భారీ ఇంజన్లు పెట్టి.. పునాదుల్లోని నీటిని బయటికి తోడేస్తున్నట్లు సమాచారం. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?