వైసీపీ తరపున తొలిసారి ఎమ్మెల్సీ అయిన కడప జిల్లా నేత జకియా ఖానంకు ఆ పార్టీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ కూడా చేసింది. జగన్ సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా ఆమెకు ఈ పదవి దక్కింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఆమె వైసీపీకి దూరం కావడం ప్రారంభించారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను కలిశారు. వారితో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. దీంతో ఆమె టీడీపీలో చేరడం ఖాయమని అంతా భావించారు. కానీ అక్కడే ట్విస్ట్ ఎదురైంది.
టీడీపీలో చేరతారని భావించిన మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ జకియా ఖానం ఇవాళ అనూహ్యంగా బీజేపీలో చేరిపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. దేశంలో ముస్లిం వర్గాలు బీజేపీకి క్రమంగా దూరమవుతున్న వేళ జకియా ఖానం ఇలా అనూహ్యంగా కాషాయ పార్టీలో చేరడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీ నినాదం సబ్ కే సాత్.. సబ్ కా వికాస్ అన్నారు. తమ పార్టీలో కుల మతాలకు తావు లేదని తెలిపారు. ఇది బీజేపీ మూల సిద్ధాంతం అన్నారు. శాసన మండలి వైస్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసి జకియా ఖానమ్ బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. మైనార్టీలకు బీజేపీపై ఉన్న ప్రేమ, విశ్వాసం జకియా ఖానమ్ చేరికతో మరోసారి రుజువైందన్నారు.
మరోవైపు జకియా ఖానం ఇలా టీడీపీని కాదని బీజేపీలో చేరడం వెనుక కూటమి వ్యూహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన ఈ ముస్లిం ఎమ్మెల్సీని తమవైపుకు తిప్పుకోవడం ద్వారా బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదన్న సంకేతాలు పంపడం కాషాయ పార్టీ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఎలాగో మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవీకాలం ముగుస్తున్న తరుణంలో బీజేపీకి ఆ పదవి ఇచ్చేందుకు వీలుగా జకియా ఖానంను ఇలా తమ పార్టీలో చేర్చుకున్నట్లు కనిపిస్తోంది.

