SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 14 May 2025, 6:39 am Posted by : SHIVASURYA NEWS

52వ సీజేఐగా జస్టిస్‌ బీఆర్ గవాయ్‌ ప్రమాణ స్వీకారం..

భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించగా.. ప్రధాని మోడీతో పాటు, కేంద్ర మంత్రులు, ఉప రాష్ట్రపతి, ఇతర అతిథుల పాల్గొన్నారు.
మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబరు 24న గవాయ్‌ జన్మించారు. 1985 మార్చి 16న న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 2003 నవంబరు 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 నవంబరు 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొంది పలు ధర్మాసనాల్లో సేవలందించారు. గత ఆరేళ్లలో జస్టిస్‌ గవాయ్‌ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వాములయ్యారు. ఇక 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
జస్టిస్‌ బీఆర్ గవాయ్‌ పేరును మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా ఏప్రిల్‌ 16వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. గవాయ్‌ సీజేఐగా ఆరు నెలలు కొనసాగి నవంబరు 23న పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తిగా గవాయ్‌ పేరు పొందారు. అంతకు ముందు జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన మొదటి దళిత న్యాయమూర్తిగా ఖ్యాతి గడించారు.