SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 07 May 2025, 11:10 am Posted by : SHIVASURYA NEWS

సజావుగా పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలను నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

విశాఖపట్నం, జయజయహే : జిల్లాలో ఈ నెల 19 నుండి 28వ తేదీ వరకు జరగబోవు పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు మరియు 12వ తేది నుండి 17వ తేదీ వరకు జరగబోవు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖ అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణపై సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు, జిల్లా కలెక్టర్ దిశా నిర్థేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19వతేది నుండి 28వ తేదీ వరకు జరగబోవు పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు మరియు 12వతేది నుండి 17వ తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరపు పబ్లిక్ థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్షలు జిల్లాలో జరగనున్నందున, నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా, విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు……

ఈ నెల 19వతేది నుండి 28వ తేదీ వరకు జరగబోవు పదవ తరగతి పరీక్షలు ఉదయం 9-30గంటల నుండి 12-45 గంటల వరకు జరుగనున్నట్లు తెలిపారు. మొత్తం 4563 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. అందులో 3152 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 1411మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఇందుకోసం 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 27 మంది చీఫ్ సూపర్డెంట్లను, 27 మంది డిపార్ట్మెంట్ అధికారులను, నలుగురు రూట్ ఆఫీసర్లను, మరో నలుగురు అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లను పరీక్షలు నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. పదవ తరగతి క్వశ్చన్ పేపర్స్ ప్రభుత్వ క్వీన్ మేరీ గర్ల్స్ హై స్కూల్ నుండి సెంటర్స్ కు పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరపు పబ్లిక్ థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్షలు..ఈ నెల 12 నుండి 17వ తేదీ వరకు జరగబోవు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రతిరోజు ఉదయం 9-00 గంటల నుండి 12-00 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, అదేవిధంగా మధ్యాహ్నం 2-30 గంటల నుండి 5-30 గంటల వరకు రెండవ సంవత్సరం పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం 66 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.