SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 15 May 2025, 6:07 am Posted by : SHIVASURYA NEWS

రెయిన్ అలెర్ట్..!

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

జయజయహే : తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పగలు ఎండలు, సాయంత్రం వేళ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌కు కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండలు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. వాతావరణ మార్పుల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, కోనసీమ, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పిడుగులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వద్ద నిలబడరాదన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబొంతులో 53.5మిమీ, రాగోలులో 49.2మిమీ, శ్రీకాకుళం 47.2మిమీ, ఏలూరు జిల్లా పూళ్ళలో 44.5మిమీ, శ్రీకాకుళం ఎల్ఎన్ పేటలో 38.5మిమీ, ఆముదాలవలసలో 35.7మిమీ, ఏలూరులో 34.5మిమీ, పార్వతీపురంమన్యం జిల్లా పాలకొండలో 32.7మిమీ వర్షపాతం నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ చెప్పారు. అలాగే రేపు ఉష్ణోగ్రతలు 41-43°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. పార్వతీపురంమన్యం జిల్లా గరుగుబిల్లిలో తీవ్రవడగాలులు, శ్రీకాకుళం-1, విజయనగరం-16, పార్వతీపురంమన్యం-10, అల్లూరి-1, కాకినాడ-5, తూర్పుగోదావరి-1 మండలాల్లో(34) వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు.