SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 03 May 2025, 7:41 am Posted by : SHIVASURYA NEWS

రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణం

మరో రెండు రోజులు వర్షాలు, ఎండలు….రాయలసీమలో 42 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

అమరావతి: జయజయహే : రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో పలు ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మరో రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ప్రాంతంలో ఎండలతోపాటు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రాయలసీమ ప్రాంతంలో ఎండలు మండుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా కమలాపురంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో 41.7, తిరుపతి జిల్లా వెంకటగిరిలో41.3, కర్నూలు జిల్లా రేవూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. వర్షాలతోపాటు పిడుగులు పడుతుండడంతో ప్రజలు, వ్యవసాయ పనులు చేసుకునేవారు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు 41 నుంచి 42.5 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.