ప్రజలకు మౌలిక వసతులు కల్పించా
మాజీ మేయర్ హరికుమారి ఉద్వేగం
మహా విశాఖ నగరపాలక సంస్థకు నాలుగు ఏళ్ల పాటు మేయర్ గా పదవిని బాధ్యతతో నిర్వర్తించినందుకు, విశాఖ నగర ప్రజలకు సేవలను, సంక్షేమ పథకాలను అందించినందుకు, మౌలిక సదుపాయాలను కల్పించినందుకు చాలా సంతృప్తినిచ్చిందని , సహకరించిన విశాఖ నగర ప్రజలకు విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నాలుగు సంవత్సరాలు విశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని, పార్టీలకు అతీతంగా ప్రతి కార్పొరేటర్ కు సమదృష్టితో మనస్ఫూర్తిగా నిధులు కేటాయిస్తూ విశాఖ అభివృద్ధికి కృషి చేశానని, ఈ 4 సంవత్సరాలలో ఎంతో జటిలమైన సమస్యలను పరిష్కరించామని , కరోనా వ్యాప్తి సమయంలో ప్రజలకు అండగా ఉంటూ వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపామన్నారు. ముఖ్యంగా అడివి వరం నుండి గోశాల రోడ్డు, జగదాంబ నుండి పూర్ణ మార్కెట్ పాత పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్లు, “బస్ బే” లు, జంక్షన్ల అభివృద్ధి మొదలైనవి చేపట్టడం జరిగిందని. నేడు నాకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి కార్పొరేటర్ కు తెలుసని వారికి నిధులు కేటాయింపులో ఎటువంటి వివక్షతను చూపలేదని అలాగే నాలుగు సంవత్సరాల ఒక నెలపాటు మేయర్ క్యాంప్ కార్యాలయం నా సొంత భవనాన్ని వినియోగించుకున్నందున కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, అలాగే విశాఖ నగరం మరో ఢిల్లీ కాకూడదని ఉద్దేశంతో విశాఖ నగరం కాలుష్యానికి గురికాకుండా, ప్రజల ఆరోగ్యమే పరమావధిగా భావిస్తూ ప్రతి సోమవారం తమ సొంత వాహనాన్ని వదిలి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో జీవీఎంసీ కి రావడంతో పాటు జీవీఎంసీ ఉద్యోగులను కూడా వారి వాహనాలను వదిలి వచ్చేలా అవగాహన కల్పించామన్నారు. జీవీఎంసీ మేయర్ గా తమ క్యాంపు కార్యాలయంలో జీవీఎంసీ ఏర్పాటుచేసిన ప్రతి వస్తువును తిరిగి జీవీఎంసీకి అప్పజెప్పడం జరుగుతుందని ఆమె తెలిపారు. విశాఖ నగర అభివృద్ధికి కృషి చేస్తూ,నగర ప్రజలకు ఎన్నో సేవలను అందించిన సంతృప్తిని ఆశ్వాదించే భాగ్యానికి నోచుకోకుండా , అన్ని వార్డుల్లో కార్పొరేటర్లకు వార్డు అభివృద్ధి పనులను మేయర్ గా మంజూరు చేసిన నాకు నేడు మేయరు పై అవిశ్వాస తీర్మానం పెట్టిన తీరు ఎంతో కలచి వేసిందని, ఆవేదనకు లోనయ్యానని ఆమె విషాదాన్ని వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో యాదవ కులానికి చెందిన బీసీ మహిళనైన నేను విశాఖ నగర మేయర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నేటి వరకు నాలుగేళ్లలో కాలంలో విశాఖ అభివృద్ధిలో భాగస్వామ్యమై నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశానని, దేశంలోనే విశాఖ నగరం గర్వించేలా స్వచ్ఛ సర్వేక్షన్ లో ఎన్నో ర్యాంకులు సాధించామని గుర్తు చేసారు.

