Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీమా తెలుగుతల్లికి గీతాలాపనతో మహానాడు 2025 లాంఛనంగా ప్రారంభం..

మా తెలుగుతల్లికి గీతాలాపనతో మహానాడు 2025 లాంఛనంగా ప్రారంభం..

టీడీపీ మహానాడు ఘనంగా మొదలైంది. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు
 కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. మహానాడు ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అందరికీ అభివాదం చేస్తూ సీఎం మహానాడు వేదిక వద్దకు చేరుకున్నారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి.. ఆపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. తరువాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపనతో మహానాడు వేడుక లాంఛనంగా ప్రారంభమైంది.

అంతకుముందు మహానాడు ప్రాంగణానికి చేరుకున్న వెంటనే.. చిత్తూరు పార్లమెంట్ ప్రతినిధుల నమోదు కేంద్రంలో అధినేత చంద్రబాబు పేరు నమోదు చేసుకున్నారు. ఆపై మహానాడు ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. మహానాడు వేడుకలో ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీడీ జనార్దన్, శ్రీపతి సతీష్ ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. మహానాడులో తొలిసారిగా డిజిటల్ ఫార్మాట్‌లో ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. నారా నందమూరి కుటుంబాలకు సంబంధించిన విశేషాలను తెలియజేసే విధంగా ఫోటోలను ప్రదర్శించారు. అలాగే యువగళం పాదయాత్ర విశేషాలను కూడా ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.

ఈ ఫోటో ప్రదర్శన ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్‌కు సంబంధించిన జీవిత చరిత్ర విశేషాల పుస్తకాలతో పాటు ఎన్టీఆర్ అసెంబ్లీలో ప్రసంగించిన ముఖ్యమైన ఘటనల పుస్తకాలను కూడా ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన అనంతరం రక్తదాన శిబిరం, వైద్య శిబిరాలను సీఎం ప్రారంభించారు. రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి రక్తదానం చేసి చంద్రబాబు నుంచి తొలి సర్టిఫికెట్‌ను పొందారు. రక్తదానం చేసిన వారి వద్దకు వెళ్లి మరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?