SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 03 May 2025, 9:03 am Posted by : SHIVASURYA NEWS

బాల్య వివాహాల నిర్మూలన సామాజిక బాధ్యతగా తీసుకోవాలి- డాక్టర్ కందుల నాగరాజు

జయజయహే : బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. 32 వ వార్డులో బాల్య వివాహాల నిర్మూలనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ కందుల నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో ముఖ్యంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహం వలన పిల్లలపై ఎటువంటి దుష్పరిణామాలు ఏర్పడతాయో విశదీకరించాలన్నారు. బాల్య వివాహం నిషేధ చట్టం 2006 గురించి వివరించారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, ఇందుకు రెండు సంవత్సరాల జైలు శిక్ష, ఒక లక్ష రూపాయలు జరిమానా విధిస్తారని తెలియచెప్పాలన్నారు. బాల్య వివాహంపై సమాచారాన్ని 112 లేదా చైల్డ్ లైన్ 1098 నంబర్ కు తెలియజేయాలన్నారు. ఎక్కడా ఒక్క బాల్య వివాహం కేసు కూడా నమోదు అవ్వకూడదన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమన్నారు. హాట్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. బాల్య వివాహాలు జరగకముందు జరిగిన తర్వాత కూడా కేసులు పెట్టవచ్చునన్నారు. అటువంటి వారిని గుర్తించినట్లయితే 1098కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. తెలిపిన వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ సమాచారాన్ని సక్రమంగా పంపితే బాల్యవివాహాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎం ఎస్ కె, ఏ డబ్ల్యూ,డబ్ల్యూ, ఆశ సిబ్బందితోపాటు వాసవి మహిళా మండలి సభ్యురాలు టి షర్మిల, అంగన్ వాడి టీచర్లు ఆర్ టి ఎల్ మంగరాజు, టి పార్వతి ,పి గౌతమి, ఎం.బిందు, డబ్ల్యు, డబ్ల్యు ,పి.ఎస్ సభ్యులు, ఏ.సరోజ, ఎస్. కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.