Monday, April 13, 2026
Homeశివ సూర్య డైలీబాధిత కుటుంబాలకు అండగా ఉంటాం - హోంమంత్రి అనిత

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం – హోంమంత్రి అనిత

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్ట పరిహారం

విశాఖపట్నం, జయజయహే : – సింహాచలంలో గోడ కూలిన సంఘటనపై ఏపీ హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటన అనంతరం హూటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యల్ని ఆమె ముమ్మరం చేశారు. బుధవారం తెల్లవారుజామున మృతదేహాల్ని వెలికి తీసేందుకు మంత్రే స్వయంగా రంగంలోకి దిగారు. అంతేకాకుండా సమన్వయం చేస్తూ సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలిస్తూ వచ్చారు. ఆమె కూడా జిల్లా యంత్రాంగంతో కలిసి పనుల్ని స్వయంగా పర్యవేక్షించారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించడం, మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశించడం వంటివి చేసి, బాధిత కుటుంబ సభ్యుల్లో ఆమె భరోసా నింపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్ ఆదేశాలతో ఎప్పటికప్పుడు పనుల్ని వేగవంతం చేశారు. సీఎం టెలికాన్ఫరెన్స్లోనూ ఈ ఘటనపై అనిత పూర్తి వివరాలు తెలియజేశారు. సింహాచలం చందనోత్సవం బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. చందనోత్సవంలో గోడ కూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాల్ని బుధవారం హోంమంత్రి పరామర్శించారు. ఉదయం నుంచి కేజీహెచ్ మార్చురీ వద్దే ఉండి మృతుల కుటుంబాలకు ధైర్యం చెబుతూ ఓదార్చారు. ఎట్టకేలకు మృతుల కుటుంబాల అంగీకారం మేరకు పోస్టుమార్టం జరిగేలా మార్గం సుగమం చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దుర్ఘటనకు సంబంధించి మృతుల కుటుంబాలకు రూ.25లక్షల నష్ట పరిహారం, ఒకరికి ప్రభుత్వం తరపున ఉద్యోగం ఇప్పిస్తామని ప్రకటించారు. వాస్తవానికి ఈ పరిహారం బుధవారమే చెల్లించేవారమని, అయితే జిల్లా కలెక్టర్, దేవదాయశాఖ కమిషనర్ చందనోత్సవం పనుల్లో తీరికలేకుండా నిమగ్నం కారణంగా వీలు కాలేదని మంత్రి అనిత స్పష్టం చేశారు. చందనోత్సవంలో అధికార యంత్రాంగంతో కలిసి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దుర్ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే ముగ్గురితో త్రిసభ్య కమిటీ వేశామని, కమిటీ నివేదిక వచ్చాక ప్రమాదానికి కారణమైన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనిత పేర్కొన్నారు. అదే విధంగా మృతదేహాల్ని తరలించేందుకు మహా ప్రస్థానం వాహనాల ఏర్పాట్లను ప్రభుత్వమే పర్యవేక్షిస్తోందన్నారు.

                                 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?