SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 02 May 2025, 5:55 am Posted by : SHIVASURYA NEWS

నాసిరకంగా నిర్మాణం

పది రోజుల్లోనే గోడ పనులు పూర్తి
మాస్టర్ ప్లాన్ తో సంబంధం లేకుండా గోడ
త్రిసభ్య కమిటీ దృష్టికి కీలకాంశాలు
కాంట్రాక్టర్ పైనా ప్రశ్నల వర్షం
నేడు ప్రభుత్వానికి కీలక నివేదిక

జయజయహే :విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై ప్రభుత్వం త్రిసభ్య విచారణ కమిటీ నియమించిన విషయం తెలిసిందే. మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ అధ్యక్షతన, ఈగల్‌ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు సభ్యులుగా కమిషన్‌ను నియమించారు. గురువారం ప్రమాద ఘటనను మరోసారి పరిశీలించిన కమిటీ బృందం.. రీటైనింగ్ వాల్ కూలిపోవడంతో ప్రమాదం జరిగిందని తేల్చింది. క్వాలిటీ నిర్మాణం కాకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు కనిపించిందని పేర్కొంది. ఉత్సవాల కోసం నిర్మాణాన్ని తాత్కాలిక పూర్తి చేశారన్నారు. గోడ నిర్మాణాన్ని ఈ నెల 16వ తేదీన ప్రారంభించి.. 26 వరకు చేపట్టినట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లతో పాటూ దేవాదాయ అధికారులను విచారించినట్లు మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ తెలిపారు. అలాగే జిల్లా అధికారులతో కూడ మాట్లాడినట్లు చెప్పారు. పూర్తి వాస్తవాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. అయితే టెంపుల్ మాస్టర్ ప్లాన్ నిబంధనలకు అనుకూలంగా జరిగిందా లేదా అనేది నిర్ధారిస్తామని చెప్పారు. వైఫల్యాలు, లోపాలపై నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పిస్తామన్నారు. కాంట్రాక్టర్‌తో పాటు అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరు…? ఇందులో వాళ్ల ప్రమేయం ఏ మేరకు ఉందనే అంశాలపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనలో మొత్తం ఏడుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.