తెలంగాణలో రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు – సీఎం రేవంత్ రెడ్డి
నల్లమల బిడ్డగా ఈ గడ్డపై నుంచి ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే తన గుండె ఉప్పొంగుతోందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, పార్టీ నేతలు సహా అధికారులు పాల్గొన్నారు.
అంతే కాకుండా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 60 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేసిందని గుర్తు చేశారు. సన్నాలు పండించే రైతులకు మద్దతు ధరతోపాటు రూ. 500 బోనస్ అందిస్తున్నామని రేవంత్ తెలిపారు. వరి వేస్తే ఉరే అనే పరిస్థితుల నుంచి వరి వేస్తే సిరి అనే పరిస్థితులు కల్పించామని స్పష్టం చేశారు. పేదలందరికీ సన్న బియ్యం అందించి వారి ఆత్మగౌరవాన్ని మరింత పెంచామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మంది పేదలకు సన్న బియ్యం.. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు సీఎం. ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని.. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించామని వివరించారు. అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు తమ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని వెల్లడించారు. పాలమూరోల్లకు పాలన చేతకాదన్న వాళ్లకు.. తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టగలమని నిరూపించామన్నారు. ఎంతోమంది ప్రధానులు అయినా…. ప్రతీ తండాలో.. పేదవాడి గుండెల్లో నిలిచిపోయింది మాత్రం ఇందిరమ్మ మాత్రమేనని కొనియాడారు.
RELATED ARTICLES

