SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 16 May 2025, 5:54 am Posted by : SHIVASURYA NEWS

డిఎస్సీ పై కుట్రలు

వాయిదా కుదరదు

చాలా సమయం ఇచ్చాం

సిలబస్ ముందే ప్రకటించాం

మంత్రి లోకేశ్ స్పష్టీకరణ

జయజయహే : అధికారంలోకి వచ్చామని అలసత్వం వద్దని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేద్దామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని రామరాజుపల్లెలో గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో మంత్రి సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలతోనే సమావేశం అవుతామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకునేందుకే వచ్చినట్టు చెప్పారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా అమరావతి అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయ స్వామి, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ వైసీపీ దాష్టీకాలకు ఎదురొడ్డి నిలిచారని గుర్తు చేశారు. అందుకే పార్టీ వారి రుణం తీర్చుకున్నట్టు వెల్లడించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 94 శాత సీట్లతో విజయం సాధించామని తెలిపారు. గెలిచినప్పుడు అందరూ చప్పట్లు కొడతారని 2019-24 మధ్య జరిగిన అవమానాలు మర్చిపోకూడదని నాయకులు, కార్యకర్తలకు హితవుపలికారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును జైల్లో అక్రమంగా నిర్భంధించారన్నారు. ఎన్నికల్లో ఎదురొడ్డి నిలిచిన అంజిరెడ్డి, మంజులారెడ్డి, తోట చంద్రయ్యలే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు స్ఫూర్తి అన్నారు. కార్యకర్తలు, నాయకులపై అనేక అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. యువగళంలో తనను కూడా అవమానించారని అయినా సరే అడుగడుగునా పోరాడి విజయం సాధించామన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,247 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నామని లోకేష్ వెల్లడించారు. జూన్ నుంచి పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. డీఎస్సీ ఆపేందుకు వైసీపీ సుప్రీంకోర్టు వరకు వెళ్లిందని… సమయం పెంచాలంటున్నారన్నారు. గతేడాది డిసెంబర్‌లోనే సిలబస్ ప్రకటించామని గుర్తు చేశారు. జగన్ రెడ్డికి అసలు సిలబస్ అంటే ఏంటో తెలియదని ఎద్దేవా చేశారు. స్థానికులకే పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. రూ.22వేల కోట్లతో అనంతపురం జిల్లాలో రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు.

చంద్రబాబుతో పోటీ

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించేందుకు కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు పయ్యావుల. కేంద్రం, చంద్రబాబు బ్రాండ్‌తో ప్రభుత్వాన్ని నడుపుకోగలగుతున్నామని వెల్లడించారు. చంద్రబాబు బ్రాండ్‌తో పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ఎన్నడూలేని విధంగా రూ.3,800 కోట్లతో హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు చేపట్టి పూర్తిచేశామని వెల్లడించారు. రాయలసీమ అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. అనంతలో రూ.22వేల కోట్లతో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ రాబోతోందన్నారు. మంత్రి లోకేష్ విద్యాశాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని కితాబు ఇచ్చారు. టైం మేనేజ్‌మెంట్‌లో చంద్రబాబుతో పోటీపడుతున్నామని అన్నారు. పనితీరు చాలా స్ట్రైట్‌గా ఉంటుందని నాయకుల కంటే కార్యకర్తలకే ఎక్కువ సమయం ఇస్తున్నారని తెలిపారు. మరో 30 ఏళ్ల పాటు బలమైన నాయకత్వాన్ని తయారుచేసే పనిలో ఉన్నారని అన్నారు.