Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీజూన్ నుంచి చౌకదుకాణాల్లోనే రేషన్ పంపిణీకి నిర్ణయం...నాదెండ్ల మనోహర్

జూన్ నుంచి చౌకదుకాణాల్లోనే రేషన్ పంపిణీకి నిర్ణయం…నాదెండ్ల మనోహర్

ఏపీలో రేషన్ పంపిణీ విషయంలో తలెత్తుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ సర్కార్ రేషన్ ను నేరుగా ఇంటికే అందించేందుకు వీలుగా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసింది. వీటిని కూటమి సర్కార్ రాగానే దాదాపుగా పక్కనబెట్టేసింది. ఇప్పుడు వచ్చే నెల నుంచి రేషన్ పంపిణీ విధానంలో కీలక మార్పులు చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన రేషన్ డెలివరీ వాహనాల వల్ల రేషన్ పంపిణీ సక్రమంగా జరగడం లేదని, అందుకే తిరిగి చౌక దుకాణాల్లో రేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూన్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. ప్రస్తుతం ప్రతీ రేషన్ వాహనానికీ నెలకు 27 వేలు చెల్లిస్తున్నామని, అయినా రేషన్ పంపిణీపై లబ్దిదారుల్లో అసంతృప్తి ఉందన్నారు. అందుకే తిరిగి చౌకదుకాణాల్లోనే రేషన్ పంపిణీకి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గతంలో 29 వేల రేషన్ షాపుల ద్వారా పంపిణీ జరిగేదని, కానీ వైసీపీ ప్రభుత్వం కేవలం 9 వేల వాహనాలతో రేషన్ పంపిణీ చేసిందన్నారు. దీని వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం తిరిగి రేషన్ షాపుల్లోనే బియ్యం సహా ఇతర వస్తువులు పంపిణీ చేస్తామన్నారు. మరోవైపు 66 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఇళ్ల వద్దనే రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి చౌక దుకాణాలు 15వ తేదీ వరకూ అందుబాటులో ఉంటాయన్నారు. ఆ సమయంలో రేషన్ ను తీసుకోవాలని లబ్దిదారులకు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?