SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 22 April 2025, 1:57 pm Posted by : SHIVASURYA NEWS

జగన్ కు హోంమంత్రి అనిత సవాల్..!

ఏపీలో విపక్ష వైసీపీని టార్గెట్ చేస్తూ వరుస అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణితో ప్రారంభిస్తే గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి పాల్పడిన రాజ్ కసిరెడ్డి, ఇంటెలిజెన్స్ ఛీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు వరకూ వరుస అరెస్టులు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై వైసీపీ తీవ్ర విమర్శలకు దిగుతోంది. వీటిపై హోంమంత్రి వంగలపూడి అనిత ఘాటుగా స్పందించారు.
తమ ప్రభుత్వ హయాంలో అధికారుల అరెస్టులు జరగడం లేదని, వైసీపీ హయాంలో తప్పులు చేసిన వారిని మాత్రమే అరెస్టు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత క్లారిటీ ఇచ్చారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు అరెస్టు చేశారని గుర్తుచేశారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని, అప్పట్లో మహిళలని కూడా చూడకుండా ఇబ్బందులు పెట్టారని హోంమంత్రి గుర్తుచేశారు. గతంలో టీడీపీ నేతల్ని వేధించడానికి సీఐడీని వాడిన వ్యక్తి జగన్ అన్నారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా తప్పు చేసిన వారిని మాత్రమే శిక్షిస్తున్నట్లు హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. టీడీపీ కార్యకర్తల్లో, నేతల్లో ఇలాంటి వారిపై ఆవేశం ఉన్నా తాము మాత్రం వారిని చట్ట ప్రకారమే శిక్షిస్తున్నట్లు తెలిపారు. గతంలో జగన్ వల్ల శ్రీలక్ష్మి వంటి అధికారులు జైలుకెళ్లారని, ఇప్పుడు కూడా వైసీపీ హయాంలో పనిచేసిన అధికారులే ఎందుకు జైలుకెళ్తున్నారో జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. అలాగే అరెస్టులపై జగన్ నాలుగు గోడలు దాటి బయటికి వచ్చి మాట్లాడాలని హోంమంత్రి సవాల్ విసిరారు.