SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 24 April 2025, 12:01 pm Posted by : SHIVASURYA NEWS

చందనోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన గంటా

సింహాచలం, జయజయహే : ఈనెల 30 వ తేదీన జరగనున్న సింహాచలం శ్రీ వరహా నృసింహ స్వామి వారి చందనోత్సవ ఏర్పాట్లను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. సాధారణ, ప్రత్యేక క్యూ లైన్లు, దర్శనానికి పట్టే సమయం, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న క్యూ కాంప్లెక్స్ కు ప్రారంభోత్సవం చేశారు. పాత పి.ఆర్.ఓ. ఆఫీస్ వద్ద చందనోత్సవం రూ.300, రూ.1,000 ల ప్రత్యేక టికెట్ అమ్మకాలను ప్రారంభించి, భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదేసమయంలో సాధారణ భక్తులు ఇబ్బంది పడకుండా దర్శనం చేసుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

చందనం అరగదీసిన గంటా

సింహాద్రి అప్పన్నను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం మంత్రోర్చనల నడుమ పండితులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం పవిత్రమైన చందనం అరగతీతలో పాల్గొని స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఈఓ కె. సుబ్బారావు, ఏఈఓ ఎన్. ఆనంద్ కుమార్, కార్పొరేటర్ పి.వి.నరసింహం, వార్డు టీడీపీ అధ్యక్షుడు పంచదార్ల శ్రీనివాస్, గుసిడి శంకర్రావు, మధు, అవినాష్ తదితరులు ఉన్నారు.