SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 25 May 2025, 4:43 am Posted by : SHIVASURYA NEWS

కేరళ తీర ప్రాంతంలో భారీ నౌకకు ప్రమాదం.. ప్రజలకు ఆ విషయంలో అలర్ట్ !

కేరళ తీర ప్రాంతానికి సమీపంలోని అరేబియా సముద్రంలో భయాందోళనలు నెలకొన్నాయి. సముద్ర తీరానికి సుమారు 38 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దాదాపు 184 మీటర్ల పొడవున్న కార్గో నౌక MSC ఎల్సా-3.. 26 డిగ్రీల మేర ఓ వైపునకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌక నుంచి ఆయిల్ కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి.

ఈ నౌక విష్ణుజం నుంచి కొచ్చికి వెళ్లే దారిలో ఉండగా ఒక్కసారిగా వాలిపోయినట్టు చెబుతున్నారు. దాంతో సుమారు పది కంటైనర్లు సముద్రంలో పడిపోయినట్లు అనుమానిస్తున్నారు. కంటైనర్లలో మరైన్ గ్యాస్ ఆయిల్ (Marine Gasoil) మరియు చాలా తక్కువ సల్ఫర్ ఉండే ఇంధనం (Very Low Sulfur Fuel Oil) ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ రాష్ట్ర విపత్తు సంస్థ ప్రకటించింది.

అయితే ‘విషపూరిత పదార్థాలు’ ఉన్న కంటైనర్లు సముద్రంలో పడిపోవడంతో అవి తీరానికి చేరుకునే అవకాశం ఉందని తీర రక్షణ దళం హెచ్చరించింది. ప్రజలు వాటి దగ్గరికి వెళ్లకుండా, వాటిని తాకకుండా ఉండాలని అధికారులు సూచించారు. ఈ నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నట్టు భారత తీర రక్షణ దళం గుర్తించింది. సిబ్బందిలో 9 మంది లైఫ్ రాఫ్ట్‌లలో ఉండగా.. ఒకరేమో రష్యాకు చెందిన కెప్టెన్, 20 మంది ఫిలిప్పీన్స్, ఇద్దరు ఉక్రెయిన్, ఒకరు జార్జియా దేశానికి చెందినవారు ఉన్నారు. వీరిలో 21 మందిని రక్షించారు.

మరోవైపు తీర రక్షణ దళం సహాయక చర్యలు ప్రారంభించింది. నౌకలు, విమానాల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టింది. నౌకను కాపాడేందుకు తక్షణ సాల్వేజ్ సేవలు అందించేందుకు షిప్ మేనేజర్లకు డిజి షిప్పింగ్ (DG Shipping) నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని అధికారులు స్పష్టం చేశారు.