Saturday, April 11, 2026
Homeరాజకీయంకూటమి నాటకాలు అదుర్స్.....

కూటమి నాటకాలు అదుర్స్…..

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. శాసన సభ, శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. వివిధ బిల్లులను అసెంబ్లీలో పాస్ చేశారు. శాసన సభలో వైసీపీకి సభ్యులు తక్కువ ఉన్నందున జగన్ తో సహా మిగతా 10 శాసనసభ్యులు సభకు హాజరు కాలేదు. జనసేన, బీజేపీ సభ్యులు మరియు తెలుగుదేశం శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పింది. శాసన మండలిలో చర్చలు వాడి-వేడిగా సాగాయి. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో మంత్రిమండలిని ప్రశ్నించగలిగారు. అలాగే మంత్రులు జగన్ ప్రభుత్వంఫై చేస్తోన్న విమర్శలు గట్టిగానే తిప్పి కొట్టారు. ముగిసిన శాసన సభ సమావేశాలలో వైసీపీకి పెద్ద దిక్కుగా చురుకైన పాత్ర పోషించి బొత్స భేష్ అనిపించుకున్నారు. పదవీ కాలం పూర్తయిన శాసన మండలి సభ్యులకు సత్కారాలు చేసి గౌరవించారు.ప్రజాసమస్యలపై, రాష్ట్ర అభివృద్ధిపై తలమునకలైన శాసన సభ్యులు పలు అంశాలపై వాడి, వేడి చర్చలు జరుపుతూ తీరిక లేకుండా గడిపారు. శాసన సభ జరుగుతున్న అన్ని రోజులూ ప్రజల కోసం శ్రమపడ్డ సభ్యులకు కాస్త ఊరట చెందేందుకు ఆట, పాట కార్యక్రమాలు చేపట్టారు. ఇదేమి క్రొత్త కాదు. రాజకీయ నాయకులు ఆటలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. ప్రజా సేవలో తల మునకలైన ప్రజా ప్రతినిధులకు కాస్త ఆట విడుపు, మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు వివిధ క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగానే శాసన సభ్యులు క్రీడాకారులుగాను, నటులుగాను మారిపోయారు. శాసన సభ వేదిక నుండి వినోదాల మైదానంలోకి వచ్చి ఒక్కసారిగా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఎగిరి గెంతులేసి యువకులుగా మారిపోయారు. కొంతమంది శాసన సభ్యులు పౌరాణిక నాటకాలను ప్రదర్శించి, ప్రభుత్వ మన్ననలను పొందారు.దుర్యోధనుడిగా శాసన సభ ఉప సభాపతి రఘురామకృష్ణం రాజు “ఆగాగు! ఆచార్యదేవా! హహ్హ.. ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా ! ఎంతమాట, ఎంతమాట ! ఇది క్షేత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ? కాదు, కాకూడదు, ఇది కులపరీక్షయే అందువా ! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ? మట్టి కుండలో పుట్టితివికదయ్యా! హహ్హ… నీది ఏ కులము? ఇంతయేల, అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగా గర్భమున జనిoచలేదా ! ఈయనదే కులము? నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశీపుత్రుడు కాడా? ఆతడు పంచమజాతి కన్యయగు అరుంధతియందు శక్తిని, ఆ శక్తి ఛండాలాంగనయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటిదాసితో- ధర్మనిర్మాణచణుడని మీచే కీర్తింపబడుచున్న- హ.. ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము- ఏనాడో కులహీనమైనది, కాగా, నేడు కులము.. కులము అను వ్యర్ధవాదమెందులకు?” అని ఎన్టిఆర్ నటించిన ‘దాన వీర శూర కర్ణ’ డైలాగును చెప్పగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేచి చప్పట్లు కొట్టి ఉప సభాపతి రఘురామకృష్ణం రాజును అభినందించారు. పల్నాడు బాల చంద్రుడిగా టూరిజం, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తన నటనా కౌశలంతో సభికులను ఆకట్టుకున్నారు. పల్నాడు పౌరుషం చూపించే పాత్రను అవలీలగా తన నటనా చాతుర్యంతో మెప్పించారు. బీజేపీ శాసన సభ్యులు విష్ణుకుమార్ రాజు, ఎన్. ఈశ్వరరావులు కూడా వారి నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. వీరి డైలాగులతో ప్రేక్షకులలో నవ్వులు పూయించారు. వీరినందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడులు అభినందించారు – దుశ్శాలువలతో సన్మానించారు. రాజకీయ నాయకులు రాజకీయాలే కాదు, ఆటలలో, ఇతర కళలలో కూడా రాణించాలని ప్రభుత్వ పెద్దలు కోరారు. సభలు చిరునవ్వులతో ముగిసాయి. ప్రభుత్వ పెద్దలు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఎచ్చెర్ల శాసన సభ్యులు ఎన్.ఈశ్వరావు చేసిన స్కిట్ కి విశేష స్పందన లభించింది. జగన్ హావభావాలతో జగన్ ని ఉద్దేశించి నటించిన స్కిట్ లో ‘వెనుకటి ఒకడుండేవాడు. వాడు చావు దగ్గరకి వెళ్లినా, శుభకార్యానికి వెళ్లినా వాడి మొఖం ఒకేలా ఉంటాదిరా -ఓహో ఆ పదకుండో వాడా’ అనే డైలాగ్ చెప్పగానే ముఖ్యమత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నవ్వు ఆపుకోలేక కడుపుబ్బా నవ్వేశారు. మరియు ఆ ప్రాంగణం అంతా నవ్వులతో చప్పట్లతో మారుమోగిపోయింది. ఈ స్కిట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చాలా వ్యతిరేఖతను చోటు చేసుకుంది కూడా. ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు దుర్యోధనుడిగా చాలా బాగా నటించారని ఆయనకు తోడుగా శకునిగా చంద్రబాబు కూడా నటిస్తే ఇంకా రక్తికట్టేదని వైసీపీ విమర్శించింది.

మధు బోజంకి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?