SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 5:19 am Posted by : SHIVASURYA NEWS

కస్టడీకి సీఏస్సార్ – జాత్వానీ కేసులో ప్రశ్నల వర్షం

జయజయహే : ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ను సిఐడి అధికారులు ఆదివారం నాడు కస్టడీకి తీసుకున్నారు. వైసిపి హయాంలో ముంబై నటి కాదంబరి జత్వానీ, ఆమె కుటుంబాన్ని వేధించిన కేసులో ఐపీఎస్ ఆంజనేయులు నిందితుడుగా ఉన్నారు. ఈ కేసులో మొత్తం ముగ్గురు ఐపీఎస్ లో నిందితులుగా ఉన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులును సిఐడి అధికారులు ఇటీవల అరెస్ట్ చేసి విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. ఏసీబీ కోర్టు అనుమతించడంతో సిఐడి అధికారులు ఐపీఎస్ ఆంజనేయులును నేటి ఉదయం కస్టడీకి తీసుకున్నారు. అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఆంజనేయులుకు మెడికల్ టెస్ట్ లు చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఆంజనేయులను సిఐడి అధికారులు మూడు రోజులపాటు విచారించనున్నారు.

తొలి రోజు విచారణకు బ్రేక్

ముంబయి నటి కాదంబరీ జెత్వానీకి వేధింపుల కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు రిమాండు విధించడంతో ఆయన్ను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అయితే, ఈనెల 25న విజయవాడ కోర్టు 3 రోజుల పాటు సీఐడీ కస్టడీకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆంజనేయులను సీఐడీ అధికారులు ఆదివారం కస్టడీలోకి తీసుకోగా, ఆయన అస్వస్థతకు లోనయ్యారు. హైబీపీ సమస్యతో బాధపడుతున్న ఆయనను వైద్య పరీక్షల కోసం విజయవాడ జీజీహెచ్ కు తరలించారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కొందరు పార్టీ నేతలు హాస్పిటల్ కు వెళ్లి ఆంజనేయులును పరామర్శించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాల్సి ఉంది. కానీ ఆయన అస్వస్థతకు లోను కావడంతో నేటి విచారణ వాయిదా వేసిన సీఐడీ అధికారులు ఆయనను తిరిగి విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు.