SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 01 May 2025, 9:12 am Posted by : SHIVASURYA NEWS

ఒక్కొక్కరికి కోటి రూపాయలు కాంట్రాక్టరే చెల్లించాలి – జనచైతన్య వేదిక

జయజయహేవ్ : ఏప్రిల్ 30వ తేదీన సింహాచలంలోని సింహాద్రి అప్పన్న సన్నదిలో గోడకూలి మరణించిన7 గురు కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం కాంట్రాక్టర్ నుండే ఇప్పించాలని ,తద్వారా భవిష్యత్తులో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించేందుకు ఈ చర్య దోహదపడుతుందని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. ఈనెల 1వ తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జరిగిన మీడియా సమావేశంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ కాంట్రాక్టర్లు, అధికారులు, అధికార పార్టీల నేతల లాలూచి వ్యవహారాలతో నాణ్యత ప్రమాణాలు ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తున్నాయన్నారు. 12 అడుగుల ఎత్తు గల గోడను హడావుడిగా పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజనీర్లు నాసిరకంగా నిర్మించడం, ఎలాంటి బలమైన పునాదులు లేకుండా కాంక్రీట్ వాడకుండా, ప్లాస్టింగ్ చేయకుండా, సరిగ్గా క్యూరింగ్ చేయకుండా గోడ నిర్మాణం చేయడమే ఏడుగురు భక్తులు మరణానికి దారితీసిందని తెలిపారు. ఈ ఘోరమైన దుర్ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని, సంబంధిత కాంట్రాక్టర్ ను అరెస్టు చేయాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కాంట్రాక్టర్ నుండి కోటి రూపాయలు పరిహారంగా మరణించిన కుటుంబాలకు ఇప్పించడం ద్వారా భవిష్యత్తు లో ఇలాంటి నాణ్యత ప్రమాణాలు లేని నిర్మాణాలు జరగటానికి ఆస్కారం లేకుండా చూడాలని కోరారు.