Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీఏడేళ్ల జైలు శిక్ష

ఏడేళ్ల జైలు శిక్ష

ఏ1 శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలికి విధింపు

దోషులుగా రాజగోపాల్, అలీఖాన్ లకు వర్తింపు

నిర్దోషులుగా సబితా ఇంద్రారెడ్డి, కృపానందం

ఓబుళాపురం మైనింగ్ కేసులో సంచలన తీర్పు

జయజయహే : ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సుదీర్గంగా సాగిన విచారణ తర్వాత తీర్పు వచ్చింది. గాలి జనార్ధన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్‌లతో పాటు ఓఎంసీ కంపెనీని దోషులుగా తేల్చారు. ఇందులో ఏ వన్ గా శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. మిగిలిన నిందితులకూ అదే జైలుశిక్ష విధించారు. ఓఎంసీ కంపెనీకి లక్ష జరిమానా విధించారు. కర్ణాటక, అనంతపురం సరిహద్దుల్లో ఐరన్ ఓర్ ను ఇష్టం వచ్చినట్లుగా తవ్వేసి ఎగుమతి చేసుకున్నారన్నా ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దులు కూడా చెరిపేశారని సీబీఐ కేసులు నమోదు చేసింది. 2009లో సీబీఐ ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి సీబీఐ జేడీ లక్ష్మినారాయణ గాలి జనార్ధన్ రెడ్డిని బళ్లారి నుంచి అరెస్టు చేసి తీసుకు వచ్చారు. దాదాపుగా రెండేళ్లకుపైగా జైల్లో ఉన్న తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. గనుల దోపిడీ జరిగిన సమయంలో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి బయటపడ్డారు. ఆమెను నిర్దోషిగా కోర్టు స్పష్టం చేసింది. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందం కూడా నిర్దోషిగా బయట పడ్డారు. మరో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని గతంలోనే హైకోర్టు డిశ్చార్జ్ చేసింది. దీంతో ఈ కేసు నుంచి వీరు సురక్షితంగా బయటపడ్డారు. తుది తీర్పు సందర్భంగా గాలి జనార్ధన్ రెడ్డి తనకు చాలా కంపెనీలు ఉన్నాయని తనపై ఆధారపడి వేల మంది ఉన్నారని తన శిక్ష రద్దు చేయాలని జడ్జిని వేడుకున్నాడు. అయితే ఈ విజ్ఞప్తుల్ని న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. దేశవ్యాప్తంగా ఓబులాపురం కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో అరెస్టు అయిన గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కోసం తప్పుడు పనులు చేశారు. ఏకంగా జడ్దిలకు లంచాలు ఇచ్చారు. అరెస్టు అయిన కొద్ది రోజులకు ఆయనకు దిగువకోర్టులో బెయిల్ వచ్చింది. దీనిపై అప్పటి సీబీఐ జేడీ నిఘా పెట్టడంతో సీబీఐ కోర్టు జడ్జిల గురించి బయటకు వచ్చింది. డబ్బులు కూడా తీసుకున్నట్లుగా బయటపడటంతో పట్టాభిరామారావు అనే న్యాయమూర్తి దొరికిపోయారు. తర్వాత ఆయన చనిపోయారు. జడ్జిలకు లంచం ఇచ్చిన కేసులోనూ.. గాలి జనార్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. ఆయనపై విచారణ జరుగుతోంది. ఈ కేసులోనూ తీర్పు రావాల్సి ఉంది. గాలి జనార్ధన్ రెడ్డి ప్రస్తుతం కర్ణాటకలోని గంగావతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు ఏడేళ్లకుపైగా శిక్ష పడటంతో అనర్హతా వేటు పడనుంది. శిక్ష ఖరారు చేయడంతో నిందితుల్ని.. కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. గతంలో చాలా కాలం అదై జైల్లో ఉన్న ఆయన ఇప్పుడు మరోసారి అదే జైలుకు వెళ్తున్నారు. అయితే శిక్షను ఉన్నత న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశం ఉంది. కానీ ఆ ప్రయత్నాలు జైల్లోనే ఉండి చేయాల్సి ఉంటుంది. కర్ణాటక రాజకీయాల్లో మరోసారి తన ప్రభావం చూపించాలని అనుకున్న ఆయన కు జైలు శిక్షపడటంతో అక్కడా రాజకీయంగా కలకలం రేపుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?