SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 13 May 2025, 6:04 am Posted by : SHIVASURYA NEWS

ఉపశమనం..!

ఇక విస్తారంగా వర్షాలు

ఆంధ్రకు నాలుగు రోజులు సూచన

జయజయహే : ఈ వేసవికాలంలో విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట ఎండలు మాడు పగలగొడుతుండగా రాత్రి పూట విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఏపీకి సంబంధించి విశాఖ వాతావరణ కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రానున్న నాలుగు రోజల పాటు రాష్ర్టంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమలో రానున్ననాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40-50 కిమీ వేగంతో గాలుల వీచే అవకాశం ఉందని వివరించింది. పంటలు వేసిన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక తెలంగాణలో మాత్రం వాతావరణం అందుకు భిన్నంగా ఉండనుంది. రానున్న రోజుల్లో ఎండలు తీవ్రం కానున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులు సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి గడచిన వారం రోజులుగా వాతావరణంలో కొంత మార్పు కనిపించింది. గత ఏడాదితో పోలిస్తే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. రాత్రి పూట వాతావరణం కొంత కూల్‌గా ఉంది. కానీ వచ్చే రోజుల్లో మాత్రం గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.