Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీఉత్కంఠగా సివిల్ మాక్ డ్రిల్

ఉత్కంఠగా సివిల్ మాక్ డ్రిల్

ఇకపై సచివాలయాల పరిధిలో కూడా

జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడి

జయజయహే : కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాలకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం విశాఖ‌ప‌ట్ట‌ణం న‌గ‌రంలో బుధ‌వారం ప‌లు చోట్ల సివిల్ మాక్ డ్రిల్ నిర్వ‌హించింది. అనుకోని రీతిలో ఉగ్ర‌దాడులు జరిగినా, బాంబులు పేలినా, అగ్ని ప్ర‌మాదాలు వాటిల్లినా ఎలా వ్య‌వ‌హ‌రించాలి అనే అంశాల‌పై ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ ర‌క్ష‌ణ ద‌ళాలు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చాయి. బుధ‌వారం సాయంత్రం ఒన్ టౌన్ ప‌రిధిలోని రాణీబొమ్మ సెంట‌ర్, క్వీన్ మేరీ బాలికోన్న‌త పాఠ‌శాల‌లో వేర్వేరుగా నిర్వహించిన ఆప‌రేష‌న్లలో సివిల్ డిఫెన్స్, అగ్నిమాప‌క‌, ఎస్.డి.ఆర్.ఎఫ్‌., ఎన్.డి.ఆర్.ఎఫ్., పోలీసు, జీవీఎంసీ, రెవెన్యూ, సివిల్ స‌ప్లైస్, వైద్య శాఖ‌, ప‌లువురు వాలంటీర్లు భాగ‌స్వామ్య‌మ‌య్యారు. ముందుగా రాణీబొమ్మ సెంట‌ర్లో రెండు భ‌వ‌నాల్లో ఉగ్ర‌మూక‌లు పొగ బాంబుల‌తో దాడులు చేయ‌గా స్పందించిన అగ్నిమాప‌క శాఖ సిబ్బంది మంట‌లను అదుపు చేశాయి. వెనువెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లానికి మాస్క్ లు ధ‌రించి చేరుకున్న ఎస్.డి.ఆర్‌.ఎఫ్‌. స‌హాయ‌క సిబ్బంది ప్ర‌మాదంలో చిక్కుకున్న ప్ర‌జ‌ల‌ను కాపాడారు. నిచ్చెన సాయంతో కొంద‌రిని కింద‌కు దించ‌గా, మ‌రికొంద‌రిని భ‌ద్ర‌తా సిబ్బంది మెట్ల మార్గం ద్వారా కింద‌కుదించారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని హుటాహుటిన ప్రమాద స్థ‌లానికి స‌మీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరాల‌కు త‌ర‌లించి ప్ర‌థమ చికిత్స అంద‌జేశారు. ఒన్ టౌన్ ప‌రిధిలోని క్వీన్ మేరీ బాలికోన్న‌త పాఠ‌శాల‌లో ఎస్.డి.ఆర్.ఎఫ్‌. బృందాలు ప్ర‌త్యేకంగా మాక్ డ్రిల్ నిర్వ‌హించాయి. ఉగ్ర‌మూక‌ల దాడుల నేప‌థ్యంలో త‌ర‌గ‌తి గ‌దుల్లో చిక్కుకున్న విద్యార్థుల‌ను, ఉపాధ్యాయుల‌ను ఎలా ర‌క్షించాలో, వారు ఎలా వ్య‌వ‌హ‌రించాలో ప్ర‌ద‌ర్శ‌నలు ఇస్తూ అప్ర‌మ‌త్తం చేశాయి. అలారం మోగిన‌ప్పుడు ఏ విధంగా స్పందించాలో.. సేఫ్ జోన్ కు ఎలా చేరుకోవాలో తెలిపాయి. రోప్ ల సాయంతో భ‌వ‌నాల‌పై నుంచి కింద‌కు ఎలా దిగాలో చేసి చూపించాయి. ఈ క్ర‌మంలో ఎస్.డి.ఆర్.ఎఫ్. ప్ర‌త్యేక వాహ‌నంలో ఉండే ప‌రిక‌రాల వినియోగం, వాటితో ప్ర‌మాదం నుంచి ఎలా త‌ప్పించుకోవ‌చ్చో ఎస్.డి.ఆర్.ఎఫ్. అధికారులు ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ఎస్.డి.ఆర్.ఎప్‌. ఐజీ రాజ‌కుమారి, జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్, పోలీసు క‌మిష‌న‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చీ, జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్ ప్ర‌క్రియ‌ను దగ్గ‌రుంచి ప‌ర్య‌వేక్షించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాల ప‌నితీరు, వాహ‌నంలో ఉండే వివిధ ర‌కాల ప‌రిక‌రాల వినియోగం గురించి అడిగి తెలుసుకున్నారు.

పలు చోట్ల బ్లాక్ అవుట్ డ్రిల్

న‌గ‌రంలోని ఒన్ టౌన్ రాణీబొమ్మ సెంట‌ర్, క్వీన్ మేరీ బాలికోన్న‌త పాఠ‌శాల‌, విశాఖ‌ప‌ట్ట‌ణం పోర్ట్ ట్ర‌స్ట్ ప‌రిధిలో బుధ‌వారం సాయంత్రం సివిల్ మాక్ నిర్వ‌హించిన ర‌క్ష‌ణ బృందాలు అదే రోజు రాత్రి కొన్నిచోట్ల బ్లాక్ అవుట్ డ్రిల్స్ నిర్వ‌హించి ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశాయి. ఉగ్ర‌మూక‌లు అనుకోని రీతిలో చీక‌టిని సృష్టించి ప్ర‌జ‌ల‌పై దాడులు చేసేందుకు ప‌న్నాగం ప‌న్నిన క్ర‌మంలో ర‌క్ష‌క ద‌ళాలు ఎలా స్పందించాలి, ప్ర‌జ‌లు ఏ విధంగా వ్య‌వ‌హ‌రించాలి అనే కోణంలో ఒన్ టౌన్ ప్రాంతంలో, సీతమ్మధార ఆక్సిజ‌న్ ట‌వ‌ర్స్ లో బుధ‌వారం రాత్రి బ్లాక్ అవుట్ నిర్వ‌హించాయి. విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేసి ఉగ్ర‌మూక‌లు దాడుల‌కు తెగ‌బ‌డితే ఏ విధంగా స్పందించాలి.. వ్య‌వ‌హ‌రించాలి అనే విష‌యంపై ర‌క్షక ద‌ళాలు ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశాయి.

సచివాల‌య ప‌రిధిలో మాక్ డ్రిల్

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా రాబోయే కొద్ది రోజుల్లో న‌గ‌రంలోని అన్ని వార్డు సచివాల‌యాల ప‌రిధిలో సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వ‌హిస్తామ‌ని, ఉగ్రదాడుల‌పై ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ తెలిపారు. ఒన్ టౌన్ ప‌రిధిలో బుధవారం సాయంత్రం జ‌రిగిన మాక్ డ్రిల్ స‌మ‌యంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న పలు అంశాల‌పై స్పందించారు. అనుకోని రీతిలో ప్ర‌మాదం వాటిల్లితే ప్రజ‌లు ఎలా స్పందించాలో ముందునుంచే అప్ర‌మ‌త్తం చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. దానిలో భాగంగా న‌గ‌రంలో ప‌లు చోట్ల సాధార‌ణ‌ సివిల్ మాక్ డ్రిల్స్ తో పాటు, బ్లాక్ అవుటు మాక్ డ్రిల్స్ నిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు. నిజ‌మైన ఘ‌ట్టంలో ఏ విధంగా అధికారిక బృందాలు, వైద్య బృందాలు వ్య‌వ‌హ‌రిస్తాయో తెలుపుతూ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నామ‌ని చెప్పారు. అగ్నిమాప‌క వాహ‌నాల‌ను, అంబులెన్స్ ల‌ను, ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీములు, ఎమెర్జెన్సీ స‌హాయక‌ వాహ‌నాలు, తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, ర‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో వినియోగించే అన్ని ర‌కాల ప‌రిక‌రాల‌ను ప్ర‌ద‌ర్శ‌నలో ఉంచామ‌ని క‌లెక్ట‌ర్ వివ‌రించారు. భ‌విష్య‌త్తులో అనుకోని ఘ‌ట‌న‌లు ఏమైనా జ‌రిగిన‌ట్ల‌యితే వాటిని స‌మ‌ర్ధంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం స‌న్న‌ద్ధంగా ఉంద‌ని విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు జిల్లా క‌లెక్ట‌ర్ సమాధాన‌మిచ్చారు

                    

                 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?