SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 24 April 2025, 7:17 am Posted by : SHIVASURYA NEWS

ఉగ్ర దాడి అమానుషం – జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి

యాత్రికులను కాపాడుతూ ప్రాణాలను అర్పించిన నిజమైన హీరో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా

గుంటూరు : జయజయహే : పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రమూకలు దాడి చేసి 26 మందిని అమానుషంగా కాల్చి చంపడాన్ని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయాలకు అతీతంగా దేశ సమగ్రతను కాపాడడానికి భారతీయులందరూ ఐక్యంగా ఉగ్రవాదం అంతమయ్యే వరకు ఉద్యమించాలన్నారు. జమ్ము కాశ్మీర్ లో అత్యధిక ఆదాయం టూరిజం ద్వారా వస్తుందని ,ఇలాంటి అమానుషమైన ఉగ్రదాడులతో టూరిజం పతనమవుతుందన్నారు. 2024 సంవత్సరంలో దాదాపు 20 లక్షల కు పైగా యాత్రికులు జమ్మూ కాశ్మీర్ ను సందర్శించడం జరిగిందని రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి టూరిజం ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ భారతదేశానికి మద్దతు పలకడం అభినందనీయమన్నారు. ఉగ్రవాదుల ఉగ్ర దాడి మానత్వానికే మచ్చగా మిగిల్చిందని తెలిపారు. సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఉగ్రవాదుల దాడి నుండి యాత్రికులను రక్షించడానికి తీవ్రంగా కృషి చేసి తన ప్రాణాలను అర్పించడాన్నీ భారతీయులు మరువ లేరన్నారు. టెర్రరిస్ట్ ల నుండి తుపాకీని లాక్కుని యాత్రికులను రక్షించడానికి చేసిన ప్రయత్నాన్ని భారత ప్రజలు మతాలకు అతీతంగా స్వాగతించాలన్నారు. 29 సంవత్సరాలు గల సయ్యద్ అదిల్ హుస్సేన్ షా యాత్రికులకు తన గుర్రం ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ కుటుంబానికి జీవన ఆధారంగా ఉన్న సయ్యద్ అదిల్ హుస్సేన్ షాను నిజమైన హీరోగా భావించాలన్నారు. ముస్లింల సహాయంతోనే అనేకమంది రక్షించబడ్డారని ముస్లిం వ్యాపారస్తుల సహకారంతో తమ ప్రాణాలను కాపాడుకోగలిగామని యాత్రికులు తెలిపారన్నారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా ముస్లిం వ్యాపారస్తులందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించారన్నారు .ఉగ్రవాదుల దుర్మార్గపు దాడులను మతాలకు అన్వయింప చేయరాదని రాజకీయ పార్టీలకు జనచైతన్య వేదిక విజ్ఞప్తి చేస్తుంది. ఉగ్రవాదులపై చేసే దాడి ముస్లింలపై చేసే దాడిగా చిత్రీకరించవద్దని లక్ష్మణరెడ్డి కోరారు .భారతీయ లౌకిక తత్వాన్ని కాపాడటానికి ఐక్యంగా కృషి జరగాలన్నారు.