SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 11:32 am Posted by : SHIVASURYA NEWS

ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదు..

దేశానికి మతసామరస్యం ఎంతో అవసరం..

దేశంలో మత కల్లోలాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది..

డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

మంగళగిరి: జయజయహే : ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదని, దేశానికి మతసామరస్యం ఎంతో అవసరమని డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంతకు ముందు పెహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన జనసేనపార్టీ క్రియాశీలక కార్యకర్త మధుసూధన్ చిత్రపటానికి పార్టీ నేతలు పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… హల్గాం తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన 26 మందిలో జనసేన క్రియాశీలక కార్యకర్త మేడిశెట్టి మధుసూదన్ కూడా ఒకరన్నారు. కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల తూటాలు పేలితే దాని ప్రకంపనలు మాత్రం భారతదేశం అంతా పాకిందన్నారు. ఉగ్రవాదులు షికారుకు వచ్చినట్లు వచ్చి 26మందిని వేటాడి క్రూరంగా చంపేసి వెళ్లిపోయారని, మధుసూదన్ తలలో 40 బుల్లెట్లు దింపారంటే ఉగ్రవాదులు ఎంత దారుణంగా, క్రూరంగా వ్యవహరించారో అర్థమవుతుందన్నారు. ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదని, వారిని తీసివేయాలన్నారు. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన 26 మందిలో ఒకే ఒక్క ముస్లిం ఉన్నాడన్నారు. ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను కాల్చివేశారని, హిందువుగా పుట్టడం వారు చేసుకున్న పాపమా? అని ప్రశ్నించారు. దేశానికి సహనం ఎక్కువైందని, అతిసహనం కూడా మంచిది కాదన్నారు. ఎందుకు మౌనంగా ఉండాలని… సమాజంపై ప్రతి ఒక్కరూ నిరంతర పహారా కలిగి బాధ్యతగా ఉండాలన్నారు. ఉగ్రవాదులను ఎదుర్కోవడం ఎంతో ధైర్యంతో కూడుకున్న పని అని అన్నారు. మన ఆలోచన విధానం జాతీయవాదం అని, దేశంలో యుద్ధ పరిస్థితులు రావచ్చు రాకపోవచ్చునన్నారు. దేశంలోని కొందరు సెక్యులర్ వాదులు ఉగ్రవాదులు మతం అడిగి చంపలేదని చెబుతున్నారని, ఉగ్రదాడిపై వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలని, అంతేగానీ సన్నాయి నొక్కులు నొక్క వద్దని హితవుపలికారు. భారతదేశంలో కూర్చుని పాకిస్థాన్ ను ప్రేమిస్తున్నారని, పాకిస్తాన్ పై అంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ కు వెళ్లిపోవచ్చునన్నారు. పాకిస్తాన్ ఇస్లామిక్ నేషన్ అయితే ఇండియా హిందూ దేశమన్నారు. ఇండియాలో ఎంతోమంది ముస్లిం నాయకులు, ముస్లింలు ఉన్నారని, ఏ రోజు వారిపై వివక్షత చూపించలేదన్నారు. అలాగే ముస్లింలకు ఏదైనా సమస్య వస్తే తామే గొంతుక అవుతామన్నారు. ఉగ్రవాదులు మత ప్రాతిపదికన చంపడం సహించలేమన్నారు. ఉగ్రవాదులకు తాను ఒకటే చెబుతున్నానని… ఇదివరకు భారతదేశం కాదని, సరికొత్త భారతదేశం అన్నారు. మీ ఇష్టానికి వచ్చి కాల్చివేస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. అన్నింటికీ సిద్ధపడే తాము రాజకీయాల్లోకి వచ్చామన్నారు. ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు మధుసూదన్ కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. పార్టీ తరపున ఆయన కుటుంబానికి రూ.50లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ లు కొణిదెల నాగబాబు, పిడుగు హరి ప్రసాద్, మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.