SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 07 May 2025, 10:32 am Posted by : SHIVASURYA NEWS

ఆపరేషన్ సిందూర్ పై భద్రతా బలగాలకు అభినందనలు తెలిపిన కేబినేట్..

జయజయహే : పహల్గాంలో చేసిన ఉగ్రదాడికి కౌంటర్ గా నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ పై భారత సైన్యం మిసైల్స్ తో విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన ఈ దాడిపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సాహసోపేతంగా పాక్ పై కచ్చితమైన దాడి చేయించిన ప్రధాని మోడీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ సహచరులతో భేటీ అయిన ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై చేసిన ఆపరేషన్ సింధూర్ గురించి తన కేబినెట్ మంత్రులతో మాట్లాడుతూ ఇది గర్వకారణమైన క్షణమంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఈ దాడుల్ని విజయవంతంగా నిర్వహించిన భద్రతా బలగాలను మరోసారి ప్రదాని మోడీ అభినందించారు. అంతే కాదు ఇది నవ భారతం అంటూ ప్రధాని మోడీ మంత్రులతో తెలిపారు. 25 నిమిషాల పాటు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ఎలా సాగాయో మంత్రులకు మోడీ వివరించారు. పాకిస్తాన్ పై పరిమిత దాడి తర్వాత ఎదురుకాబోయే పరిస్దితులపై కేంద్రం నిఘా వర్గాలతో పాటు త్రివిధ దళాధిపతులతో చర్చిస్తోంది. ఆ వివరాలను ఇవాళ కేబినెట్ భేేటీలో మంత్రులకు ప్రధాని మోడీ వివరించినట్లు తెలుస్తోంది. రేపు అఖిలపక్ష భేటీ నిర్వహించి పాకిస్తాన్ పై దాడి ఎలా జరిగిందో వివరించేందుకు కేంద్రం సిద్దమవుతోంది. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై ఎలాంటి చర్య తీసుకోవాలన్న అంశంపై త్రివిధ దళాలకు ప్రధాని మోడీ స్వేచ్ఛ ఇచ్చారు. పహల్గాం దాడికి కారకులుగా భావిస్తున్న జైషే మహమ్మద్, లష్కరే ముజాహిదీన్ వంటి సంస్థల స్దావరాల్ని టార్గెట్ చేస్తూ భారత్ చేసిన దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు, వారి అనుచరులు, కుటుంబీకులు చనిపోయినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ స్వయంగా 26 మంది ప్రజలు ఈ దాడిలో చనిపోయారని, 46 మంది గాయపడ్డారని ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో భారత్ చర్యపై అంతర్జాతీయంగా కూడా మద్దతు లభిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ ను ఎదురయ్యే ప్రతిఘటనకు భారత్ సర్వసన్నద్ధమవుతోంది.