భీమవరం : జయజయహే : భీమవరం డిఎన్నార్ కళాశాల గన్నాబత్తుల క్రీడా మైదానంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న చైతన్య భారతి 18వ జాతీయస్థాయి నాటికల పోటీలు ఆదివారంతో ముగిసాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ రుద్రరాజు పద్మరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
రాష్ట్ర మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ
నాటకాలపై ప్రేక్షకుల నుంచి ఆదరణ తగలేదని, ఎక్కడో లోపమే తప్పిందని, ఆధునిక నాటకం కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. గత 5 ఏళ్లులో కళాకారులకు ఎటువంటి పురస్కారాలు లేవని, కళా వ్యవస్థను నాశనం చేశారని అన్నారు. కళాకారులు గొంతు ఎత్తాలని, నంది పురస్కారాలను నంది నాటకాలను నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో సాంస్కృతిక రంగాన్ని అభివృద్ధి చేస్తామని, కళాకారులకు పూర్తి సహకారం అందిస్తామని, కళాకారుడు కోరుకునేది గౌరవం మాత్రమేనని అన్నారు. నేషనల్ స్కూల్ డ్రామాను రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరడం జరిగిందన్నారు. బాలచంద్రుని పాత్ర భీమవరంలో ప్రదర్శించానని, రెండేళ్లపాటు భీమవరంలోనే చదువుకున్నానని అన్నారు.
ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ నాటికలపైన సినీ రంగంపై ప్రజలకు ఆసక్తి తగ్గిపోయిందని, నాటక రంగం మరుగున పడిపోయిందని అన్నారు. నాటక రంగానికి ప్రభుత్వ రంగ సహకారం అందడంలో ఎటువంటి సందేశంలో లేదన్నారు. సమాజంలో మార్పులను తీసుకొచ్చేవి కూడా నాటికలేనని, సమస్యలను వేలు ఎత్తి చూపేవి కూడా నాటికలేనని అన్నారు. కళా రంగాన్ని నిలబెట్టడానికి గత 17 ఏళ్లు నాటిక పోటీలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు.
ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ నాటకాలకు ప్రేక్షకుల ఆదరణ సంఖ్య తగ్గిందని, కళాకారులకు తప్పనిసరిగా నిరుత్సాహం కలిగిస్తుందని అన్నారు. సౌకర్యాలు కల్పించిన నాటకాలు చూసేందుకు ప్రేక్షకులు రావడం లేదని, దీనికి పరిష్కారం కూడా చూపలేక పోతున్నామన్నారు. గతంలో కళలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, కూటమి ప్రభుత్వంలో కళాకారుల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం ప్రముఖ కార్డియాలజిస్ట్ డా పెన్మెత్స కృష్ణంరాజు కు ఆత్మీయ చైతన్య పురస్కారం, సినీ రంగస్థల నటులు బాలాజీ నాయక్ కు మైనంపాటి శ్రీరంగ నాయకులు ఆత్మీయ చైతన్య పురస్కారం, తోలేరు సుబ్రహ్మణ్య కళా పరిషత్ అధ్యక్షులు చవాకుల సత్యనారాయణకు రాయప్రోలు చైతన్య పురస్కారాలను అందించి సత్కరించారు. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, మంతెన రామ్ కుమార్ రాజు, భట్టిప్రోలు శ్రీనివాసరావు, బొండా రాంబాబు, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, పేరిచర్ల లక్ష్మణ వర్మ, పెన్నాడ శ్రీనివాస్, కె. వి. రమణ, రమణ మూర్తి, సుందరం, మోహన్ స్వామి, భాషా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


